● ఘనంగా మాతృభాషా దినోత్సవం
● తల్లులకు సత్కారం
విజయనగరం టౌన్: బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. నడక, నడత నేర్పే గురువు తల్లి, ఆమెను మించిన దైవం లేదని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గీతాంజలి పాఠశాలలో శనివారం పలువురు మాతృమూర్తులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి మాట్లాడుతూ అమ్మ అంటే దైవసమానమని, అమ్మప్రేమకు ప్రత్యామ్నాయం లేదన్నారు. న్యాయవాది నాలుగెస్సుల రాజు, వస్త్ర వ్యాపారవేత్త పులిపాటి రామారావు, జెడ్పీహైస్కూల్ తెలుగు పండిట్ దశగ్రంథాల వెంకట సుబ్రహ్మణ్యంలు మాతృమూర్తి గొప్పతనాన్ని వివరించారు. అనంతరం రచయిత శ్రీనివాసరావు రచించిన పైడితల్లి పదాలు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బి.రమేష్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పలుకూరి ప్రభావతి, జిల్లా శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు గిరిజా ప్రసన్న, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవి, విశ్వసాహితీవేదిక అధ్యక్షురాలు భోగరాజు సూర్యలక్ష్మి, న్యాయవాది దాసరి పద్మ, తదితరులు పాల్గొన్నారు.
డీఎఫ్‌ఓగా సోమసుందరం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారిగా (డీఎఫ్‌ఓ) ఎం.సోమసుందరం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీఎఫ్‌ఓగా పనిచేసిన రెడ్డి కొండలరావుకు ఐఎఫ్‌ఎస్ అధికారిగా ఉద్యోగోన్నతి లభించడంతో రాజమండ్రికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సోమసుందరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీ సంరక్షణలో సమర్ధవంతంగా సేవలందిస్తానని తెలిపారు.
జిల్లా సర్వే అధికారి బదిలీ
● ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డుల అధికారి (ఏడీ) ఎం.శ్రీనివాసరావుకు బదిలీ అయ్యింది. జిల్లాకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయనను ఇక్కడ నుంచి బదిలీ చేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయానికి తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఐఓఎస్‌గా పనిచేస్తున్న ఎ.మన్మథరావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
పలు ఆరోపణల నేపథ్యంలో వేటు వేశారా?
జిల్లా సర్వే అధికారిగా ఎం.శ్రీనివాసరావు బదిలీపై వచ్చి కొద్ది నెలలే అయ్యింది. మొదటి నుంచి ఆయన వైఖరి పట్ల తీవ్ర విమర్శలు వచ్చా యి. ప్రధానంగా మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నట్లు, కార్యాలయంలో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు వారిని ఉంచేస్తున్నట్లు, అర్ధరాత్రి సమయంలో ఫోన్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇదే విషయమై ఓ మహిళా ఉద్యోగిని ఇటీవల నాలుగు పేజీల ఫిర్యాదును సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఈ విషయంలో గతంలో ఒకసారి కలెక్టర్, జేసీ కూడా ఆయనను పిలిచి మందలించారు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా.. మళ్లీ వేధింపులు ప్రారంభించారని తెలిసింది. మరోసారి జేసీకి నేరుగా ఫిర్యాదు వెళ్లడంతో ఆయన తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏడీకి బదిలీ కావడం గమనార్హం. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించడం వెనుక ఆయన మీద వచ్చిన ఆరోపణలే కారణంగా తెలుస్తోంది.
సెల్‌ఫోన్ల రికవరీ
పూసపాటిరేగ: మండలంలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసి వారికి శనివారం అందజేశారు. ఎవరి ఫోన్లు పోయినా ఐఎంఐ నంబర్‌తో వచ్చి ఫిర్యాదు చేయాలని, రికవరీ సాధ్యమవుతుందన్నారు.


