● విడుదలైన నోటిఫికేషన్
● ఈ నెల 30 వరకు గడువు
పాలకొండ రూరల్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన కొద్ది రోజుల కిందట వెలువడింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీలో టెన్త్ మార్కులు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇక్కడ సీటు లభిస్తే ఇంటర్ రెండేళ్లతో పాటు సమీకృత కోర్సుగా ఇంజినీరింగ్ విద్య కూడా అందుతుంది. ఇది మరో నాలుగేళ్లు అభ్యసించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఆరేళ్లు ఇక్కడే చదువుకోవచ్చు. దీంతో పలువురు ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలువురు ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ఫలితాల్లోనే కాకుండా మార్కుల సాధనలో కూడా ముందంజలో ఉంది. ఈ క్రమంలో తమ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సదరు కళాశాలలు అండగా ఉంటాయని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
ఈ బ్రాంచ్‌ల్లో అవకాశం
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నేతృత్వంలో మన రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలు ఉన్నాయి. అర్హత మేరకు విద్యార్థులు ఈ కళాశాలల్లో సీటు పొందవచ్చు. ఏటా ఒక్కో కళాశాలలో వెయ్యి మంది వంతున 4 వేల మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు తొలి రెండేళ్లు ఇంటర్‌తో పాటు ఇంజినీరింగ్ తరగతులు ఉచితంగా కొనసాగిస్తారు. సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సుల్లో తర్ఫీదు అందిస్తారు. ఇడుపులపాయ, న్యూజివీడు క్యాంపస్‌ల్లో మెటీరియల్ కోర్సులతో పాటు మెటలర్జికల్, కెమికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు అదనంగా నిర్వహిస్తారు. చదువుల కాలంలో విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం లభిస్తుంది.
అప్‌లోడ్ చేద్దామిలా...
అర్హులైన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్‌జీయుకెటి.ఇన్ (ఠీఠీఠీ.టజ ఠజ్టు.జీ ుఽ) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉటుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్థి ఆధార్, ఫోన్ నంబర్, పదవ తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 4 శాతం మార్కులు అదనంగా కలిపి అర్హుల జాబితాల్లో చేరుస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఓబీసీ విద్యార్థులు రూ.400 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్ నెల 12న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనున్నారు. అవకాశం లభించిన విద్యార్థులు జూలై 1న నిర్దేశిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.


