కొత్తవలస: మండలంలోఓని కంటకాపల్లి పంచాయతీ పరిధి భామసాగర్ చెరువు వద్ద శనివారం నాటుబాంబు కలకలం రేపింది. ఈ ప్రాంతంలో అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు నాటుబాంబులను ఉపయోగిస్తుంటారు. రాత్రి సమయల్లో అడవి పందులు తిరిగే దారుల్లో వేటగాళ్లు నాటుబాంబులను అమర్చి తెల్లవారుజామున తీసేసి భద్రపరుచుకుంటారు. ఈ క్రమంలో వేటగాళ్లు నిర్లక్ష్యంగా వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే చెరువులో గత నెల ఏప్రిల్ 20వ తేదీన ఉపాధి పనులు నిర్వహిస్తుండగా నాటుబాంబు పేలి గ్రామానికి చెందిన కక్కల అప్పారావు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే. ఇంతలోనే మళ్లీ నాటుబాంబు కలకలం రేగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి జరగబోయే ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.


