విజయనగరం టౌన్: ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ ఇంటర్ విద్యను వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా అందించేందుకు ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్టు ఖాదర్‌బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ ఎం.డి. ఖలీలుల్లా షరీఫ్ తాజ్ ఖాదరీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12లోపు విద్యార్థులు ఏపీ వక్ఫ్‌బోర్డు లింక్‌ను ఓపెన్‌చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి ఇంటర్ రెసిడెన్షియల్ విద్యతో పాటు, ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.
ఈ సెట్‌లో ‘రమ్య’మైన ప్రతిభ
సంతకవిటి: మండలంలోని వాల్తేరు గ్రామానికి చెందిన గురుగుబెల్లి రమ్య శుక్రవారం విడుదలైన ఈసెట్ ఫలితాల్లో సత్తాచూపింది. రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఆమె సిరిపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో చదివి పదో తరగతిలో 520 మార్కులు సాధించింది. పాలిసెట్‌లో ర్యాంకు సాధించి అనకాపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఈసెట్‌కు సిద్ధమై మంచి ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రాము, రాజు వ్యవసాయ కూలీలు. కుమార్తె చదువులో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. బాలికకు గ్రామస్తులు పలువురు అభినందనలు తెలిపారు.


