పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

పాలకొండ – వీరఘట్టం

రహదారిలో ఘటన

పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో పాటు పలువురికి గాయాలు

పాలకొండ రూరల్‌: పాలకొండ – వీరఘట్టం ప్రధాన రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందం సభ్యులు గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి రోడ్డుపై ఆగి ఉన్న మరో వివాహానికి సారె సామగ్రిని తీసుకువెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు... రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన ఐ.సత్యనారాయణ, పద్మ దంపతులు తమ కుమార్తె వివాహ నిమిత్తం ఆటోలో వీరఘట్టం మండలం పాలమెట్టకు బంధువులతో కలిసి ప్రయాణమయ్యారు. అప్పటికే పెళ్లి కుమార్తె మరో వాహనంలో వెళ్లింది. ఇదే సమయంలో సీతంపేట మండలానికి చెందిన మరో వివాహ బృందానికి చెందిన వారు తన చెల్లెలు పెళ్లికి సంబంధించిన సారె సామగ్రి తీసుకుని అన్నయ్య బొలెరో వాహనంతో కురుపాం బయలుదేరాడు. బొలెరో వాహనం నడుపుతున్న పెళ్లి కుమార్తె అన్న వీరఘట్టం రహదారిలోని టీ అడ్డా దాటిన తరువాత తన వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేరే పెళ్లి బృందం సభ్యులతో వస్తున్న ఆటో వీరఘట్టం నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ఆగి ఉన్న బొలెరోను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె తల్లి పద్మకు తీవ్ర గాయాలు కాగా.. తండ్రి సత్యనారాయణకు చేయి నుజ్జయ్యి అపస్మారక స్థితికి చేరారు. వీరి బంధువులైన ఐ.సూర్యనారాయణకు నడుము, కె.రాజేశ్వరికి కాళ్లు విరిగాయి. తీవ్రంగా గాయపడిన వీరిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. తీవ్ర గాయాలైన వారిని వైద్యులు శ్రీకాకుళం రిఫర్‌ చేశారు. ఇదే ఘటనలో గాయాల పాలైన కె.లక్ష్మి, ఐ.ఆదిలక్ష్మి, కె.రమణమ్మ, కె.రాజ్‌కుమార్‌, కె.అచ్చెయ్యకు స్థానిక వైద్యులు తక్షణ చికిత్స అందించారు. ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పెళ్లి బృందం సభ్యులు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కన్నీటి పర్యంతమయ్యారు. అయినవారి యోగక్షేమాల కోసం ఆరా తీశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్‌ఐ డోల వెంకన్న ప్రమాదానికి గల కారణాలు తెలసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement