ధ్రువపత్రాలు పొందేందుకు..
రామభద్రపురం: ఇటీవల పదో తరగతి, ఇంటర్ తదితర తరగతుల పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు విద్యార్హత పత్రాలతో పాటు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ధ్రువపత్రాలు పొందేందుకు ఇదే మంచి తరుణం. వేల సంఖ్యల్లో ఉన్న విద్యార్థులకు ఒకేసారి ధ్రువపత్రాలు జారీ చేయడం అధికారులకు కష్టతరమవుతోంది. ముందుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి జారీ చేయడానికి అవకాశం ఉంటుంది.
నమోదు చేసుకోవడం ఇలా..
కులం, ఆదాయ, నివాస ద్రువీకరణ పత్రాల కోసం స్వర్ణ, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల ఆధార్, కుటుంబ సభ్యులున్న రేషన్ కార్డు ఇతర పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. స్వర్ణ, గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు ఇంటర్నెట్‌లో నమోదు చేసి సంబంధిత వీఆర్‌ఓలు పరిశీలించి దరఖాస్తుకు సంబంధించి రిపోర్ట్ రాసి ఆర్‌ఐకు పంపుతారు. ఆర్‌ఐ పరిశీలించి తహసీల్దార్‌కు పంపగా అన్ని పత్రాలు పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం మండల తహసీల్దార్ చేస్తారు. సంబంధిత విద్యార్థి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కేంద్రాలకు వెళ్లి ఆయా ధ్రువపత్రాలు తీసుకోవచ్చు.
సర్వేల్లో సచివాలయ సిబ్బంది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలలోని సిబ్బందిపై పనిభారం పెరిగింది. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్ల పంపిణీతో పాటు రకరకాల సర్వేలు వారితో చేయిస్తోంది. జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా వారికి సంబంధించిన శాఖ పనులే కాకుండా ఇతర శాఖలకు చెందిన పనులు కూడా అప్పగించడంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనులు చేయడం వల్ల వారు బిజీ అయ్యారు. ప్రస్తుతం గ్రామాలలో జనగణన సర్వే ఇంటింటికీ వెళ్లి చేస్తున్నారు. పనుల కోసం సచివాలయాలకు వెళ్లిన వారికి అందుబాటులో లేక సకాలంలో సేవలు అందించలేని పరిస్థితి ఉంది. గ్రామ స్థాయిలో ప్రజలకు రోజు రోజుకు సేవలు సన్నగిల్లుతున్నాయి. జనగణన సర్వేలో డిజిటల్ అసిస్టెంట్లు కూడా ఉండడంతో ధ్రువపత్రాల కోసం చేసిన దరఖాస్తులు అప్‌లోడ్ చేసేందుకు ఆలస్యం అవుతోంది. సర్వే చేసిన తర్వాతగాని సచివాలయాలకు చేరకపోవడంతో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు సకాలంలో సేవలు అందిచలేని పరిస్థితి ఉంది. దాంతో వారు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యం కాకుండా జారీ చేస్తాం..
ధ్రువపత్రాల కోసం ముందుగా దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన పత్రాలు జారీ అవుతాయి. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి వివరాలు సక్రమంగా ఉంటే మంజూరు చేస్తాం. ఎక్కడా ఆలస్యం కాకుండా త్వరితగతిన జారీ చేయాలని ఇప్పటికే మండల స్థాయి అధికారులతో చర్చించాం. ఎవరూ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకున్నాం.
– జేవీఎస్‌ఎస్ రామమోహనరావు,
ఆర్‌డీఓ, బొబ్బిలి
దరఖాస్తు చేసుకోండి..
ధ్రువపత్రం పొందండి
విద్యార్థులకు రెవెన్యూ అధికారుల సూచన


