ఆపత్కాలంలో అండగా.. | - | Sakshi
Sakshi News home page

ఆపత్కాలంలో అండగా..

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

మానవత్వం చాటుకున్న జెడ్పీచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: రాజకీయాల్లో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మానవత్వాన్ని చాటుకున్నారు. విధులు ముగించుకుని బుధవారం రాత్రి బొబ్బిలి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విజయనగరం తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శంబంగి శంకరరావుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి

శృంగవరపుకోట: ‘బడిఈడు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి.. ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి, మెరుగైన సమాజానికి ఊతమివ్వండి’ అంటూ మండల విద్యాశాఖాధికారి–2 గణపతి లక్ష్మి నేతృత్వంలో గురువారం ఎస్‌.కోట పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అన్ని వసతులు, ప్రమాణాలతో కూడిన విద్యను బోధించే ఉపాధ్యాయులున్న ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం శైలజారాణి, కె.బంగారునాయుడు, టి.అప్పారావు, జి.వి.రమణ, చిప్పాడ సూరిబాబు, గొల్లు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం లోడు లారీ బోల్తా

వంగర: ధాన్యం లోడుతో వీరఘట్టం నుంచి వంగర వైపు గురువారం వస్తున్న లారీ వంగర మండలం రుషింగి–కొప్పరవలస గ్రామాల మధ్య పంటపొలాల్లో బోల్తా కొట్టింది. ఇరుకుగా ఉన్న రోడ్డును దాటుతుండగా దిగబడి పంట పొలాల్లోకి బోల్తాపడింది. గంటల తరబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించ లేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌ఓ

బాడంగి: మండల కేంద్రంలోని సీహెచ్‌సీని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జీవనరాణి, జిల్లా ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రాల కోఆర్డినేటర్‌ (డీసీహెచ్‌ఓ) రఘువంశీ గురువారం సందర్శించారు. సీహెచ్‌సీకి డయేరియా రోగుల తాకిడి ఎక్కువ కావడంతో సాక్షిలో ‘భయపెడుతున్న డయేరియా’ శీర్షికన గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. సీహెచ్‌సీలోని ప్రతి వార్డుకీ వెళ్లి రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యసేవలు బాగానే ఉన్నాయని రోగులు, సహాయకులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ పి. నాగేశ్వరరావు, వైద్యులు వంశీ, ఇమ్రాన్‌, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి ఎంపీడీఓకు ఫోన్‌ చేసి డయేరియా వ్యాప్తిపై ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement