విధుల నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తొలగింపు | - | Sakshi
Sakshi News home page

విధుల నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తొలగింపు

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

విజయనగరం ఫోర్ట్‌: ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరైన ప్రభుత్వ వైద్యకళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కె.జయశ్రీని విధుల నుంచి తొలగిస్తూ డీఎంఈ వేమిరెడ్డి రాధికారాణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రేడియోథెరపీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే జయశ్రీ 04, మార్చి 2024 నుంచి 30 ఏప్రిల్‌ 2026 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఏడాదిపాటు అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని టెర్మినేట్‌ చేయవచ్చు.

ఎంఆర్‌ఐ స్కాన్‌ సాయంత్రం 6 గంటలకే క్లోజ్‌..!

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐస్కాన్‌ సాయంత్రం 6 గంటలకే క్లోజ్‌ చేస్తున్నారని, 6 గంటల తర్వాత ఎంఆర్‌ఐ స్కాన్‌ అవసరమైన వారు మరుసటి రోజు వరకు వేచిఉండాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా స్కానింగ్‌ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. ఎంఆర్‌ఐ స్కాన్‌ నిర్వహణ బాధ్యతలను ఎన్‌ఆర్‌ఐ సంస్థ సరిగా నిర్వహించడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అల్లు పద్మజ వద్ద ప్రస్తావించగా ఎంఆర్‌ఐ స్కాన్‌ 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని, ఆ మేరకు ఎన్‌ఆర్‌ఐ సంస్థతో ఎంఓయూ కుదిరిందన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్కాన్‌ తీయని విషయం నా దృష్టికి రాలేదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భయపెడుతున్న డయేరియా..

వ్యాధి వ్యాప్తితో ప్రజల ఆందోళన

బాడంగి: వేసవి ఎండలను తట్టుకోలేక అత్యధికులు డయేరియా భారిన పడుతున్నారు. బాడంగి సీహెచ్‌సీకి డయేరియా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీహెచ్‌సీలో బుధవారం చేరిన వారిలో 32 మందికి 15 మంది డయేరియా బాధితులే ఉండడం గమనార్హం. గ్రామదేవత పండగలు, శుభకార్యాల సమయంలో వడ్డించే ఆహారంలో తేడా డయేరియాకు కారణంగా వైద్యులు భావిస్తున్నారు. వేసవి ఎండల్లో తిరగొద్దని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

నందివానివలసలో ఏనుగుల గుంపు

గరుగుబిల్లి: మండలంలోని నందివానివలస గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు బుధవారం సంచరించింది. రెండువారాల నుంచి గిజబ, తోటపల్లి, నాగూరు, మరుపెంట, సుంకి, నందివానివలస తదితర గ్రామాల పరిధిలో ఏనుగులు సంచరిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని సంచరిస్తుండడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement