సాక్షిప్రతినిధి, విజయనగరం:
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ భవిష్యత్ అగమ్యగోచరమవుతోందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్లు (క్లరికల్ క్యాడర్ నుంచి డీటీలుగా ఎదిగినవారు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్‌గా పదోన్నతి పొందకుండానే రిటైరయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్యాలయాల్లో మొత్తం ప్రమోటీ, ప్రొబేషనరీ డీటీ ( గ్రూప్ 2 ద్వారా వచ్చినవారు) సంఖ్య 1,513 మంది ఉన్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎలక్షన్ డీటీలు (ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు పర్యవేక్షించేవారు) 175 మంది పనిచేస్తున్నారు. అయితే పదోన్నతులకు సంబంధించి ఈ 175 మందిని మొత్తం క్యాడర్ సంఖ్య నుంచి ప్రభుత్వం మినహాయిస్తుండడంతో వీరు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు వ్యతిరేకంగా హైకోర్టులో వచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పదేళ్లకు మించి కొనసాగుతున్న ఎన్నికల డీటీ పోస్టులను శాశ్వత సిబ్బందిగానే పరిగణించాలి తప్ప వాటిని మినహాయించి లెక్కేయడం తగదన్నది వారి వాదన. తమ సమస్యను సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. ఇక మొత్తం సంఖ్య 1,513 మంది నుంచి పదోన్నతులకు సంబంధించి ఈ 175 మందిని మినహాయిస్తుండడంతో మిగిలిన మొత్తం ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్ల సంఖ్య 1,338కి తగ్గిపోతోంది. అయితే పదోన్నతులకు సంబంధించి 175 మంది ఎలక్షన్ డీటీలను మినహాయిస్తున్న క్రమంలో వరుస సంఖ్యలు, రోస్టర్లు, సీనియారిటీలు మారిపోయి.. సదరు 1,338 జాబితాలో ఉన్న వారు కూడా ‘పదవీ విరమణ చేసేలోపు’ తమకు పదోన్నతులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు. డీటీల పదోన్నతులు జోనన్‌ల వారీగా కేటాయించనుండగా, సీనియారిటీ జాబితాలో తాము బాగా వెనకబడిపోతామని ప్రమోటీ డీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్ల ఆవేదన
ఉద్యోగోన్నతి
పొందకుండానే రిటైర్ అవుతామన్న ఆందోళన


