కళ్లాల్లోనే పంట.. రైతన్న ఇంట కన్నీటి మంట | - | Sakshi
Sakshi News home page

కళ్లాల్లోనే పంట.. రైతన్న ఇంట కన్నీటి మంట

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

సీతానగరం:

రైతన్నపై చంద్రబాబు ప్రభుత్వం కినుక వహిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. కర్షకులను ఆదుకుంటామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు.. నిలువునా ముంచేస్తున్నారంటూ సీతానగరం మండలంలోని లక్ష్మీపురం, బుడ్డి పేట, చెల్లన్నాయుడువలస, వెంకటాపురం పంచాయతీల రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రబీ వరి పంట నూర్పిడిచేసి 15 రోజులుగా కళ్లాల్లోనే ధాన్యం ఉన్నా కొనుగోలు చేసేవారే లేరన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో క్వింటా పచ్చి ధాన్యం రూ.1270లకు, తేమలేకుండా ఆరబెట్టిన ధాన్యం రూ.1750కి మించి వ్యాపారులు కొనుగోలు చేయడంలేదన్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బలిజిపేట, సాలూరు ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, రైతులు నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీహెచ్‌ అప్పలనాయుడు, జి.సత్యనారాయణ, ధనంజయ్‌ తదితరులు వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రబీ ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement