కూలి బతుకులపై మృత్యు పిడుగు | - | Sakshi
Sakshi News home page

కూలి బతుకులపై మృత్యు పిడుగు

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

అందరివీ కూలి బతుకులే... రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి... కూలి చేసుకుంటూ కుటుంబాలను గుట్టుగా నెట్టుకొస్తున్నవారిని పిడుగు రూపంలో మృత్యువు కాటేసింది. కష్టపడేవారిని కుటుంబాలకు దూరం చేసింది. కుటుంబ ఆధారాన్ని అందని లోకాలకు తీసుకుపోయి ఆవేదన మిగిల్చింది. మంగళవారం సాయంత్రం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు నలుగురు మృతిచెందడం జిల్లా వాసులను కలచివేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. గ్రామస్తుల్లో విషాదం నింపింది.

రాజాం సిటీ:

విజయనగరం జిల్లాలోని రాజాం మండలం గెడ్డవలస, తెర్లాం మండలంలోని చిన్నయ్యపేటలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు తోడికోడళ్లు ఉన్నారు. గ్రామస్తులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం...

గెడ్డవలస గ్రామ సమీపంలోని పొలంలో దొండకాయలు ఏరేందుకు మజ్జి సత్యవతి (55), మజ్జి అప్పలనర్సమ్మ (50), పైల రాము (45)లు మంగళవారం ఉదయం వెళ్లారు. సాయంత్రం పిడుగులతో కూడిన వాన ఆరంభం కావడంతో భయపడ్డారు. పొలం నుంచి గట్టుకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. అంతే... పెద్దశబ్దంతో ముగ్గురిపైనా పిడుగు పడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని దూరం నుంచి చూసిన రైతులు పరుగున చేరుకుని సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన గ్రామస్తులకు తెలియడంతో ఘొల్లుమన్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు కార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

అన్నీ తానై..

మృతుల్లో ఒకరైన మజ్జి అప్పలనర్సమ్మ కుటుంబానికి అన్నీతానై ముందుకు నెట్టుకొస్తోంది. పదిహేనేళ్ల కిందట భర్త రాము మృతిచెందాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తెలను కూలి పనులు చేసుకుంటూ పెంచుతోంది. తల్లికి తోడుగా కుమారుడు రామకృష్ణ కూడా కూలి పనులు చేస్తూ చేదోడువాదోడుగా ఉంటుంటున్నారు. కాస్త ఆర్థిక ఆసరా కలిగిందన్న దశలో తల్లి మృతిచెందడంతో కుమారుడు, కుమార్తె బోరున విలపించారు.

ఆశ నెరవేరకుండానే...

పైల రాముకు ఇద్దరు కుమారులు. కూలి పనులు చేస్తూనే వారిని సాకింది. తనవలే కుమారులు కష్టపడకూడదని, ఉద్యోగాలు సాధించాలని ఆశ పడింది. పనులు చేస్తూనే ఉద్యోగ శిక్షణ కోసం వారికి కావాల్సిన డబ్బులు పంపించేది. పెద్దకుమారుడు జగన్నాథం ఈ ఏడాది విడుదలైన కానిస్టేబుల్‌ పరీక్షలో ఒక్క మార్కులో ఉద్యోగ సాధనలో వెనుకబడ్డాడు. ఉద్యోగం సాధించాలన్న తపనతో హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. డిగ్రీ చదువుకున్న రెండో కుమారుడు వాసు కూడా విజయనగరంలో ఉంటూ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నాడు. తల్లి మృతితో ఇద్దరూ కన్నీరు పెడుతున్నారు. పిల్లలు ఉద్యోగ కల నెరవేరకముందే మృత్యువు రామును కబలించిందంటూ గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు.

మృత్యువులోనూ వీడని

తోడికోడళ్ల బంధం

దొండపంటలో కూలి పనికి వెళ్లిన మజ్జి సత్తెమ్మ, మజ్జి అప్పలనర్సమ్మలు తోడికోడళ్లు. అంత వరకు మాటామంతి ఆడుకుంటూ పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు పడడంతో మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఘటనా స్థలం రోదనలతో మిన్నంటింది.

మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

పిడుగుపాటుకు నలుగురు మృతి

మృతిచెందిన ఆవు

గెడ్డవలస, చిన్నయ్యపేటలో విషాదం

మృతుల్లో ఇద్దరు తోడికోడళ్లు

అమ్మా.. లే అమ్మా...

మృతురాలు సత్తెమ్మకు భర్త నర్సింహులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో దివ్యాంగురాలైన పెద్దకుమార్తె రమణమ్మ భర్త మూడేళ్ల కిందట మరణించడంతో కన్నవారి ఇంటివద్దనే తన ఇద్దరి పిల్లలతో ఉంటోంది. వారిని కూలిపనులు చేస్తూ సత్తెమ్మ సాకుతోంది. ఇప్పుడు ఆమెను పిడుగు రూపంలో మృత్యువు కాటేయడంతో కుమార్తె రమణమ్మ బోరున విలపించింది. మృతదేహాన్ని పట్టుకుని అమ్మా... లే అమ్మా అంటూ రోదించిన తీరు అక్కడివారిలో కన్నీరు తెప్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement