పార్వతీపురం: అత్యాధునిక హంగులతో పునర్నిర్మించిన వేగావతి సమావేశ మందిరాన్ని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం నిర్వహించే కీలక సమావేశాలు, ఉన్నతాధికారులతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లకు ఎలాంటి ఆటంకం లేకుండా మెరుగైన సాంకేతికతతో నిర్వహించేందుకు ఈ హాల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లాకు వచ్చే ఉన్నతాధికారులు, వివిధ శాఖల సమీక్ష సమావేశాలకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె. హేమలత, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఆత్మ డీపీడీగా మహారాజన్
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ యాజమాన్య సాంకేతిక సంస్థ (ఆత్మ) డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కె.మహారాజన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏడీఏగా పనిచేసి ఉద్యోగోన్నతిపై డీపీడీగా ఇక్కడకు వచ్చారు.
ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు
పార్వతీపురం: జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గుర్తింపు, నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. దృష్టి పోర్టల్‌లోని ఎక్సెల్ కంటెంట్ యాప్ ద్వారా జిల్లాలోని 26 మంది ఐఈఆర్‌పీలు 0–16 ఏళ్ల పిల్లను గుర్తించి స్క్రీనింగ్‌చేసి వారి వివరాలను నమోదు చేస్తున్నారు. 15 మండలాల పరిధిలోని 2,381 హేబిటేషన్‌లలో జూన్ 10 వరకు సర్వే కొనసాగనుంది. పట్టణంలో నిర్వహిస్తున్న సర్వేలో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఐఈఆర్‌టీ కోఆర్డినేటర్ భానుమూర్తి, ఎంఈఓ కె.ప్రసాద్ పాల్గొని ఆటిజం ఉన్న తోట శ్రావణ్ ప్రజ్వల్ అనే బాలుడిని గుర్తించారు. సర్వేతో దివ్యాంగ పిల్లలకు కచ్చితమైన డేటాసేకరణ, థెరపీ, విద్యాసేవలు, ఉపకరణాల పంపిణీ, అలెవెన్స్‌ల అమలు, తదితర కార్యక్రమాలు మెరుగుపడతాయని డీఈఓ తెలిపారు.
ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలి
● ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి
సీతానగరం: పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిణి ఆర్ వైశాలి సీతానగరం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న భూ రీ–సర్వే పనులు, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన ప్రాజెక్ట్ అధికారిణి, ప్రింటింగ్‌కు సిద్ధంగా ఉన్న ధ్రువీకరణ పత్రాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్, ఆర్‌ఎస్‌డీటీ, వీఆర్వోలకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరంప్రాజెక్ట్ అధికారిణి ఆర్ వైశాలి మాట్లాడుతూ రీ–సర్వే గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఈ–కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రింటింగ్‌కు అర్హత పొందిన పత్రాలను నిశితంగా పరిశీలించి, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే వెరిఫికేషన్ పూర్తయి, ప్రింటింగ్‌కు సిద్ధంగాఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను వెంటనే ప్రింటింగ్‌కు పంపి రైతులకు సకాలంలో అందజేయాలని స్పష్టం చేశారు. పరిపాలనాపరమైన ఈ ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి వెరిఫికేషన్ ప్రక్రియను ముగించాలని ఆమె ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, డీటీ ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐ ఎన్ శ్రీనివాసరావు,వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.


