చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణపై విచారణ | - | Sakshi
Sakshi News home page

చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణపై విచారణ

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

హైకోర్టు జోక్యంతో రెవెన్యూలో కదలిక

తహసీల్దార్‌ కార్యాలయంలో విచారణ

శృంగవరపుకోట:

ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై విచారణ జరిపి, ఆక్రమణలు తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. మంగళవారం విచారణ జరిపింది. ఎస్‌.కోట మండలం ముషిడిపల్లి గ్రామంలో లేఅవుట్‌కు రోడ్డు కోసం రెండు చెరువులు పూర్తిగా కబ్జా చేశారని, ప్రభుత్వ భూములు, డీ పట్టా భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై రెవెన్యూ యంత్రాంగంలో సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదుదారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు ముషిడిపల్లి గ్రామస్తులను, ప్రజాప్రతినిధులను పిలిచి విచారణ జరిపారు. విచారణకు హాజరైన గ్రామపెద్దలు, ఎమ్మెల్సీ రఘురాజు తదితర ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలో పెద్దబంద, జగన్నాథబందలతో పాటు డీ–పట్టా భూములు కబ్జా చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2016లో నాటి పంచాయతీ కార్యదర్శి తప్పుడు తీర్మానాలు చేశారన్నారు. ప్రభుత్వ భూముల్లో లే అవుట్ల కోసం రోడ్లు వేసే హక్కు పంచాయతీలకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించాలని కోరారు. దీనిపై తహసీల్దార్‌ శ్రీనివాసరావు స్పందిస్తూ మీరు ఇచ్చిన సమాచారం నోట్‌ చేసుకున్నామని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు త్వరలో క్షేత్రస్థాయి విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణకు ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ సుధారాజు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement