బక్కచిక్కుతున్న పేద రోగులు..! | - | Sakshi
Sakshi News home page

బక్కచిక్కుతున్న పేద రోగులు..!

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

రోగులకు డైట్‌ చార్జీలు రోజుకు రూ.80

రోగులకు అందించే డైట్‌ (భోజనం) చార్జీలు సాధారణ, ఆరోగ్యశ్రీ, క్షయ రోగులకు రోజుకు రూ.80 చెల్లిస్తున్నారు. వైద్యులు, జేఎస్‌కే గర్భిణులకు రూ.100 చొప్పన చెల్లిస్తున్నారు.

– డాక్టర్‌ అల్లు పద్మజ, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

విజయనగరం ఫోర్ట్‌: పేద రోగుల పట్ల చంద్రబాబు సర్కార్‌ చిన్న చూపు చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసరాల వస్తువుల ధరలు భారీగా పెరిగినప్పటికీ డైట్‌ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పప్పు దగ్గర నుంచి ఉప్పు వరకు అన్ని ధరలూ పెరిగిపోయాయి. కూరగాయలు, ఆకుకూరల ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్‌ ధర బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో టిఫిన్స్‌, భోజనాల ధరలు బాగా పెరిగిపోయాయి. రెండు ఇడ్లీ రూ.30, శాఖహార భోజనం రూ.120 నుంచి రూ. 130 అయింది. అయినప్పటికీ పేద రోగులకు టీడీపీ సర్కార్‌ డైట్‌ చార్జీలు పెంచలేదు.

2014–18 లోనూ అదే పరిస్థితి

టీడీపీ సర్కార్‌ అధికారంలో ఉన్న 2014నుంచి 18 వరకు అదే పరిస్థితి ఉండేది. అ కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌పేషేంట్లుగా చికిత్స పొందే రోగులకు రోజుకు ఒక రోగికి రూ.40 చొప్పున మాత్రమే చెల్లించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యత లేని భోజనం పెట్టినా అడిగే నాథుడే ఉండేవాడు కాదు. ఇటువంటి తరుణంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డైట్‌ చార్జీలను రెట్టింపు చేసింది. సాధారణ రోగులకు అందించే ఒక రోజు భోజనం చార్జీలను రూ. 40 నుంచి రూ. 80కు పెంచింది. డాక్టర్లు, ఆరోగ్యశ్రీ రోగులకు రూ.50 నుంచి రూ.100కు పెంచింది.

అధికారం చేపట్టి రెండేళ్లయినా పెంచని చార్జీలు

టీడీపీ సర్కార్‌ అధికారం చేపట్టిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. అధికారం చేపట్టి 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు చంద్రబాబు సర్కార్‌ డైట్‌ చార్జీలను ఒక్క పైసా కూడా పెంచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ధరలు పెరిగిన కారణంగా రోగులకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న డైట్‌ చార్జీలు చాలక పోవడం వల్ల రోగులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోగులకు భోజనం అందించే ఆస్పత్రులు

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య విధాన్‌ పరిషత్‌ ఆస్పత్రులైన గజపతినరం ఏరియా ఆస్పత్రి, ఎస్‌. కోట ఏరియా ఆస్పత్రి , చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి, రాజాం ఏరియా ఆస్పత్రి, బొబ్బిలి సీహెచ్‌సీ, బాడంగి సీహెచ్‌సీ, నెల్లిమర్ల సీహెచ్‌సీ, భోగాపురం సీహెచ్‌సీల్లో భోజనం అందిస్తున్నారు. సర్వజన ఆస్పత్రిలో నెలకు 16 వేల మంది వరకు చికిత్స ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నెలకు 16 వేల మంది వరకు చికిత్స పొందుతున్నారు. వైద్య విధాన్‌ పరిషత్‌ 8 ఆస్పత్రుల్లో 13 వేల నుంచి 13,500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వారందరికీ ప్రతి రోజు మూడు పూటలా భోజనం అందించాలి. సాధారణ రోగులు, ఆరోగ్యశ్రీ, క్షయ రోగులకు రోజుకు రూ.80 చొప్పన చెల్లిస్తున్నారు. వైద్యులు, జననీ శిశు సురక్ష యోజన కార్యక్రమం కింద చికిత్స పొందే గర్భిణులకు రోజుకు రూ.100 చొప్పున చెల్లిస్తున్నారు.

నిత్యావసరాల ధరలు పెరిగినా డైట్‌ చార్జీలు పెంచని సర్కారు

రోజుకు ఒక రోగికి రూ.80 చెల్లింపు

ఒక్క పూట భోజనం హోటల్లో రూ.130

మూడు పూటలకు రూ.80తో ఎలా?

రోగులకు అందని నాణ్యమైన భోజనం

Advertisement
 
Advertisement
Advertisement