11న అండర్‌ 15 చెస్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

11న అండర్‌ 15 చెస్‌ ఎంపికలు

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

చీపురుపల్లి: పట్టణంలోని శ్రీనివాసా జూనియర్‌ కళాశాలలో ఈ నెల 11న ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఓపెన్‌, బాలికల అండర్‌ 15 చెస్‌ పోటీలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్‌ డైరెక్టర్‌ ఏపీవీఎన్‌ఎస్‌.మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని, పోటీల్లో పాల్గొనే వారు తప్పని సరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. ఈ పోటీలకు చీఫ్‌ ఆర్బిటర్‌గా ఏడీఎన్‌ఎస్వీ ప్రసాద్‌ వ్యవహరిస్తారన్నారు. క్రీడాకారులు తమ పేర్లను 9642546955, 9381549246 నంబర్లకు ఫోన్‌ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు.

బాధిత కుటుంబానికి

చెక్కు అందజేసిన ఎస్పీ

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన కానిస్టేబుల్‌ పి.రవి రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించగా ఆయన కుటుంబానికి గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌(జీపీఏఐ) ద్వారా మంజూరైన రూ.20.65 లక్షల చెక్కును రవి భార్య లలితకు ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌గా

సోమేశ్వర రావు

విజయనగరం క్రైమ్‌: జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ గా సోమేశ్వర రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా అగ్నిమాపక అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌, వి.కృష్ణమోహన్‌ లతో పాటు సభ్యులు ఆదినారాయణ, ప్రకాష్‌, ఉమామహేశ్వరరావు, జగదీష్‌, విజయభాస్కర్‌ జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ను మంగళవారం కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కాగా రెండు రోజుల క్రితమే జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ రామ్‌ ప్రసాద్‌ జీవీఎంసీకి బదిలీ అయ్యారు.ప్రస్తుతం అదనపు జిల్లా అధికారి అయిన సోమేశ్వర రావు జిల్లా అగ్నిమాపక అధికారిగా చార్జ్‌ తీసుకున్నారు.

పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ

నెల్లిమర్ల: పోయిన 8 మొబైల్‌ఫోన్‌లను నెల్లిమర్ల పోలీసులు వెతికిపట్టుకున్నారు. గడిచిన పదిరోజుల్లోనే 8 ఫోన్‌లు రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా టెక్నాలజీ సాయంతో ఈ ఫోన్‌లు ట్రాక్‌చేసినట్లు ఎస్సై గణేష్‌ తెలిపారు. ఫోన్‌ గొట్టుకున్నవారు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు.కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఏడుగురు గంజాయి

నిందితుల అరెస్ట్‌

విజయనగరం క్రైమ్‌: స్థానిక గూడ్స్‌ షెడ్‌ వద్ద గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఏడుగురిని విజయనగరం వన్‌ టౌన్‌ ఎస్సై కమల్‌ భార్గవ్‌ మంగళవారం అరెస్ట్‌ చేశారు. గూడ్స్‌ షెడ్‌ రైల్వేట్రాక్‌ వద్ద రెండు మూటలతో నిందితులు తచ్చాడుతుండగా ఎస్సై అనుమానంతో ప్రశ్నించడంతో వారు తడబడ్డారు. దీంతో ఎస్సై తమదైన శైలిలో విచారణ చేయగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు విజయనగరం జిల్లాకు చెందిన అరవింద్‌, తేజ స్వరూప్‌, సాగర్‌, కిషోర్‌, విశాఖకు చెందిన మహీంద్‌, నాని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై చెప్పారు. నిందితుల దగ్గర రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement