ఘనంగా రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌ ప్రారంభం

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

విజయనగరం: స్థానిక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియం వేదికగా 5వ తైక్వాండో రాష్ట్ర చాంపియన్‌షిప్‌ పోటీలు మంగళవారం సాయంత్రం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 800 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనడం గర్వకారణమని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటి స్థలాలు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల క్రికెటర్‌ శ్రీచరణికి గ్రూప్‌–1 ఉద్యోగంతో పాటు రూ.2 కోట్ల నగదు, అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజీకి ఉద్యోగం, స్థలం కేటాయించామని, మన జిల్లాకు చెందిన వెయిట్‌ లిఫ్టర్లు భార్గవి, హారికలకు కూడా త్వరలో బహుమతులు అందించనున్నట్లు ప్రకటించారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని, దీనివల్ల ఇటీవల డీఎస్సీలో 420 మంది క్రీడాకారులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని మంత్రి గుర్తుచేశారు. అనంతరం రాష్ట్ర ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం మాట్లాడుతూ, తైక్వాండో క్రీడ ఎంత ప్రమాదకరమో అంతటి క్రమశిక్షణతో కూడుకున్నదని, అకాడమీల ఏర్పాటు ద్వారా క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, తైక్వాండో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు సుభాష్‌ చంద్రబోస్‌, అధ్యక్షుడు గురాన అయ్యలు, జిల్లా క్రీడాశాఖాధికారి ఎస్‌. వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్‌, అసోసియేషన్‌ సభ్యులు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement