● రెండురోజుల్లో హంతుకుడిని
పట్టుకుంటాం
● విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాఘవులు
రాజాం: రాజాం మున్సిపాల్టీ పరిధి డోలపేట గ్రామానికి చెందిన ముంజేటి స్పందన అనే వివాహిత అనుమానస్పద మృతి హత్యేనని చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు స్పష్టంచేశారు. సంఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిస్టరీగా మారిన స్పందన అనుమానస్పద మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతురాలి భర్త సత్తీష్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 4న ఉదయం స్పందనతో పాటు ఆమె కుమారుడు శశాంక్ ఇంటి వద్దే ఉన్నట్లు తెలిసిందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మృతురాలి తల్లిఫోన్ చేస్తే మనువడు ఫోన్‌లిఫ్ట్‌చేసి, అమ్మ బట్టలు ఆరబెడుతుందని చెప్పినట్లు, తరువాత 1.30 గంటల సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్‌చేసి ఉన్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. మృతురాలి భర్త డ్యూటీ నుంచి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భోజనానికి వస్తే ఇంటికి తాళం వేసి ఉండడం, సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి తాళం అలానే ఉండడం, భర్తకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారన్నారు. ఇంట్లో కొంత బంగారంతో పాటు రూ.5 వేలు నగదు చోరీ జరిగినట్లు భర్త సత్తీష్ తెలిపారని, భార్య స్పందన మృతదేహం ఇంటి వెనుక చెరువులో ఆయనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పరిశీలించగా, ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యగా అనుమానిస్తున్నామని అన్నారు. ఈ హత్యకు కారణాలు తెలియరావడం లేదని, వీరికి గ్రామంలో ఎవరితోనూ ఎటువంటి కక్షలు, గొడవలు లేవని ధ్రువీకరించారు. మృతురాలి కుమారుడు శశాంక్ ఆచూకీ లేకపోవడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, అతను దొరికాక కేసు కొలిక్కి వస్తుందని, దర్యాప్తు పూర్తిచేసి, హంతకుడిని పట్టుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రెండు రోజుల్లో కేసును ఛేదించే దిశగా పోలీసులు ముమ్మరమైన చర్యలు చేపట్టారని వివరించారు. హత్య వెనుక కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదన్నారు. ఆయన వెంట రాజాం పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాసరావు, హెచ్.ఉపేంద్ర ఉన్నారు.


