● తహసీల్దార్ పరిశీలన
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్ సెంటర్‌లో ఉన్న బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీ దాని పరిధి దాటి ఉన్న పంట పొలాల్లో బోర్లు వేసి సాగునీటిని అక్రమంగా వినియోగించడంపై బెర్రీ కంపెనీ యాజమాన్య తీరును వివరిస్తూ ఎం.బూర్జివలస గ్రామస్తులు తహసీల్దార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ తన సిబ్బందితో కలిసి కంపెనీ తీసిన బోర్లను సందర్శించారు. రైతుల అవసరాలకు ఉపయోగపడే భూగర్భ జలాలను కంపెనీ అవసరాలకు యధేచ్ఛగా వినియోగిస్తున్న పరిస్థితిని గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వీఆర్‌ఓ వెంకునాయుడును వివరణ కోరగా అది బాడంగి మండలానికి సంబంధించిన బుచ్చింపేట పరిధిలోకి వస్తుందని అందువల్ల చర్యలు తీసుకోలేకపోతున్నామని సమాధానమిచ్చారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఫారం –3 ప్రకారం పరిశ్రమల ప్రహరీలోనే కంపెనీకి అవసరమైన బోర్లను తీసుకోవాలని, ఇలా చేయడం నేరమన్నారు. భూగర్భ జలాలు ఒకే చోట ఇంకిపోయి సమీప భూములకు అవసరమైన తేమ, నీరు లభ్యం కాదని, దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు.


