సర్వజన కష్టాలు..! | - | Sakshi
Sakshi News home page

సర్వజన కష్టాలు..!

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

వైద్యం కోసం..

ట్రై సైకిల్‌పై పేషెంట్‌ను తీసుకువస్తున్న బంధువు

విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. రిఫరల్‌ కేసులే అధికంగా కనిపిస్తున్నాయి. సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం సేవలపై ప్రభావం చూపుతోంది. ఆస్పత్రులపై పర్యవేక్షణ లోపించింది. రోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఓపీ విభాగాల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలి. కొంతమంది వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నారు. చాలా విభాగాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వైద్య పరీక్షలకు తీసుకెళ్లేందుకు సిబ్బంది నిర్లక్ష్యంచేస్తున్నారు. రోగి బంధువులే వైద్యులు, వివిధ పరీక్షలకు వీల్‌ చైర్‌, స్ట్రెచర్‌పైన, ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో స్టాప్‌ నర్సు పోస్టులు 50, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులు 10, ఫార్మసిస్టు పోస్టు–1 ఖాళీగా ఉన్నా భర్తీచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

● ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. జనరల్‌ మెడిసిన్‌ ఓపీ విభాగం ఎదురుగా ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా దర్శినమిస్తున్నాయి. డోర్‌కు గ్లాస్‌ కూడా లేదు. ఆస్పత్రి ఆవరణలోనే రోగులు వినియోగించిన గ్లౌజ్‌లను పడేస్తున్నారు.

● ఆస్పత్రిలో పరుపులు చాలక రోగులకు వరాండలో చికిత్స అందిస్తున్నారు. పక్షవాతం బారిన పడిన రోగులకు సైతం వరాండలోనే చికిత్స అందిస్తుండడం గమనార్హం. మరోవైపు ఆస్పత్రిలోని వార్డులో ఏర్పాటుచేసిన మినరల్‌ వాటర్‌ ఫ్రిజ్‌లు మూలకు చేరినా పట్టించుకునేవారే కరువయ్యారు.

● సర్వజన ఆస్పత్రిలో భాగమైన ఘోషాస్పత్రిలోని కాన్పుగదిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. మగపిల్లవాడు అయితే ఒకలా, ఆడపిల్ల అయితే ఒకలా డబ్బులు వసూలు చేస్తున్నట్టు మహిళలు చెబుతున్నారు. మగ పిల్లవాడు అయితే రూ.800 నుంచి రూ. 1000 వరకు, ఆడపిల్ల అయితే రూ.500 నుంచి రూ. 600 వరకు కలెక్షన్‌ చేస్తున్నట్టు సమాచారం.

● ప్రైవేటు అంబులెన్సుల సిబ్బందితో వార్డు బోయ్‌లు చేతులు కలుపుతున్నారు. రోగిని వైద్యులు వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేసిన సమయంలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకుడికి ఫోన్‌ చేసి అధిక అద్దెకు అప్పగిస్తున్నారు. దానికి ప్రతిఫలంగా కమీషన్‌ తీసుకుంటున్నారు. మహా ప్రస్థానం వాహనం కూడా ఒకటే ఉండడంతో రెండు మూడు మృత దేహాలు ఉన్న రోజు ప్రైవేటు అంబులెన్సులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

● బొబ్బిలి సీహెచ్‌సీలో అంబులెన్స్‌లేదు. రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్‌లే గతి. ఇక్కడ జనరల్‌ సర్జన్‌ పోస్ట్‌ ఖాళీగా ఉంది. మేజర్‌ శస్త్ర చికిత్సల కోసం జిల్లా కేంద్రాస్పత్రి, లేదంటే కేజీహెచ్‌కు తరలించాల్సిన పరిస్థితి. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కంటి పరీక్షల కేంద్రం ద్వారా కంటి అద్దాలను అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కంటి పరీక్షల కేంద్రాన్ని ఎత్తేసింది.

● చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో హైరిస్క్‌ ప్రసవ కేసులను విజయనగరం రిఫర్‌ చేస్తున్నారు. ఇక్కడ అంబులెన్స్‌ సౌకర్యం లేదు. ఇక్కటి కంటి పరీక్షల కేంద్రాన్ని ఎత్తేశారు.

● ఎస్‌.కోట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మించిన కొత్త భవనం ఇప్పటికీ వాడుకలోకి రాలేదు. ఇక్కడ వసతి సమస్య వెంటాడుతోంది. ఎముకుల విభాగం వైద్యులు లేరు. ట్రామా కేర్‌ సెంటర్‌ లేదు. అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందని పరిస్థితి.

● రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎక్స్‌రే, ల్యాబ్‌ విభాగం సక్రమంగా పనిచేయడం లేదు. రోగులు డబ్బులు చెల్లించి ప్రైవేటు ల్యాబ్‌లలో ఎక్స్‌రేలు, రక్తపరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ) రోగులకు సరిగా భోజనాలు కూడా పెట్టడంలేదు. ఉదయం పాలు, గుడ్లు, టిఫిన్‌ వంటివి ఇవ్వడంలేదని రోగులు చెబుతున్నారు.

● గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులను వైద్యం కోసం తిరిగి విజయనగరం తరలిసున్నారు. గైనిక్‌, ఆర్థో వంటి విభాగాల్లో సర్జరీలు చేసేందుకు సాహసించడంలేదన్న వాదన వినిపిస్తోంది.

వసతులు లేక రోగులు అవస్థలు

వార్డుల్లో మూలకు చేరిన మినరల్‌ వాటర్‌ ఫ్రిజ్‌లు

రోగిబంధువులే వీల్‌చైర్‌, స్ట్రెచర్‌పై

తీసుకెళ్లాల్సిన దుస్థితి

మరుగుదొడ్లు అధ్వానం

కాన్పుగదిలో సిబ్బంది చేతివాటం

చాలీచాలని బెడ్స్‌.. వరండాల్లోనే చికిత్స

Advertisement
 
Advertisement
Advertisement