పింఛన్ మంజూరు చేయాలంటూ వినతులు అందజేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన వితంతువలు కొత్తకొట్ట లక్ష్మి, వాకిటిపూడి సత్యవతి, సతివాడ హేమ
బొంతుకొండ రక్షణకు కదం తొక్కిన
కొండకరకాం
ఊరి ప్రజల ఊపిరి తీయొద్దుంటూ వినతి
పింఛన్లు ఎప్పుడు మంజూరుచేస్తారంటూ ప్రశ్నించిన లబ్ధిదారులు
విజయనగరం గంటస్తంభం: విజయనగరం కలెక్టరేట్ పరిసరాలు సోమవారం ఉదయం నుంచి ప్రజల నిరసన హోరుతో దద్దరిల్లాయి. కొండకరకాం గ్రామస్తులు, ఉపాధిహామీ వేతనదారులు, వితంతువులు, అంగన్‌వాడీ హెల్పర్లు, తోపుడు బండ్ల కార్మికులు గుంపులుగా వచ్చి తమ గోడును అధికారులకు వినిపించారు. డీఆర్వో, జేసీకి వినతిపత్రాలు అందజేశారు.
వితంతువుల ఆర్తనాదం..
భర్తలు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా పింఛన్లు మంజూరు చేయడంలేదంటూ విజయనగరం మండలం బుగ్గవీధి, రంగాలవీధి ప్రాంతాలకు చెందిన కొత్తకోట లక్ష్మి, సతివాడ హేమ, వాకిటిపూడి సత్యవతి తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం వితంతువుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వాపోయారు.
కొండకరకాం సర్వే నంబర్ 24లో బీటు నంబర్–2 వద్ద మంజూరైన దోభీఘూట్ పనులు నత్తనడకన సాగడంపై విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగవంశపు వీధి, బోయివీధి, నల్లావీధి, ఉల్లివీధి, వైఎస్సార్‌నగర్ కాలనీ ప్రాంతాల రజక వృత్తిదారులు ఆవేదన వ్యక్తంచేశారు. 2023లో రూ.9,95,000లతో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తిచేయకపోవడం దారుణమన్నారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు విన్నవించారు.
రాజాం ప్రాజెక్టులో హెల్పర్లుగా ఉన్న మహిళలకు వర్కర్లుగా ఉద్యోగోన్నతి ఇవ్వకుండా అడ్డుకోవడం తగదని సీఐటీయూ ఆధ్వర్యంలో జేసీ సేతు మాధవన్‌కు గోడు వినిపించారు. వంగర, సంతకవిటి మండలాల్లో ఇద్దరు హెల్పర్లకు ఉద్యోగోన్నతి ఉత్తర్వులు ఇచ్చాక ఎమ్మెల్యే పీఏ వద్దన్నారని ఆ కాపీలను వెనక్కి తీసుకున్నారని వివరించారు. దీనిపై జేసీ స్పందిస్తూ వారం రోజుల్లో వీరికి ఉద్యోగోన్నతులు కల్పించాలని పీడీని ఆదేశించారు.
గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సీఐటీయూ నేత జగన్‌మోహన్‌రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ వాటాను రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో 159 వినతులు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, ‘రెవెన్యూ క్లినిక్’లకు 159 వినతులు అందాయి. అందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించినవే 68 ఉన్నాయి. శాఖల వారీగా డీఆర్‌డీఏ–18, పంచాయతీ రాజ్–19, మున్సిపల్–7, డీసీహెచ్‌ఎస్–2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ–3, గ్రామ సచివాలయ శాఖ– 2, విద్యాశాఖ–5, ఇతర శాఖలు–35 వినతులు నమోదయ్యాయి. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ వినతులను తక్షణమే పరిష్కరించి డిస్పోజ్ చేయాలని అధికారులను జేసీ సేతుమాధవన్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇ.మురళి, కళావతి, ఎస్. వెంకటేశ్వరరావు, విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ఆర్డీవోలు, సీపీఓ బాలాజీ, జిల్లా సర్వే శాఖ ఏడీ ఆర్.విజయకుమార్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి, హౌసింగ్ పీడీ మురళీధర్, డీఈఓ మాణిక్యంనాయుడు, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ, మార్క్‌ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


