వివాహిత హత్య? | - | Sakshi
Sakshi News home page

వివాహిత హత్య?

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

● డోలపేటలో వివాహిత అనుమానాస్పద మృతి

● కుమారుడి ఆచూకీ కోసం గాలింపు

రాజాం సిటీ: రాజాం మున్సిపాలిటీ పరిధి డోలపేటలో సోమవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. ఇది హత్యా..? ఆత్మహత్యా అన్నది తెలియరాలేదు. భర్త సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాం జీఎంఆర్‌ ఐటీలో ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున్న ముంజేటి సతీష్‌, భార్య స్పందన (35), కుమారుడు శశాంక్‌ డోలపేటలో నివసిస్తున్నారు. సాయంత్రం 5 గంటల తరువాత విధులు ముగించుకుని సతీష్‌ ఇంటికి వచ్చాడు. తలుపులకు తాళం వేసి ఉండడం, బాత్‌రూమ్‌ వాల్‌ నుంచి నీరు రావడం గమనించాడు. తాళాలు పగులకొట్టి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడాన్ని గమనించి వెంటనే చుట్టుపక్కల ఆరా తీయగా ఇంటి వెనుక చెరువులో తన భార్య మృతదేహం కనిపించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, స్పందన శరీరంపై దాడిచేసిన ఆనవాళ్లు, రక్తం మరకలు ఉన్నాయి. స్పందన మృతిపై తొలుత కుటుంబీకులను, తరువాత భర్త సతీష్‌ను వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఉదయం డ్యూటీ నిమిత్తం కాలేజీకి వెళ్లిపోయానని, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చానని, ఇంటి వద్ద ఎవరూలేకపోవడంతో పక్కనే ఉంటున్న తన తల్లి ఇంటి వద్ద భోజనం చేసి మళ్లీ కళాశాలకు వెళ్లిపోయినట్టు సతీష్‌ వెల్లడించారు.

కుమారుడు ఎక్కడ?

స్పందన మృతి మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. కుమారుడు శశాంక్‌ ఆచూకీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్పందన, సతీష్‌లకు ఒక్కడే కుమారుడు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణుడు కావడంతో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం ఇంటి వద్దే ఉన్న శశాంక్‌ మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. స్పందన, ఆమె కుమారుడు శశాంక్‌ల మధ్య ఏదైనా వివాదం తలెత్తిందా? బయట నుంచి దుండగులు వచ్చి స్పందనను హత్యచేసి శశాంక్‌ను కిడ్నాప్‌ చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. ఉదయం నుంచి ఇంటికి తాళంవేసి ఉన్నా... సతీష్‌కు అనుమానం రాకపోవడం, డ్యూటీ నుంచి వచ్చిన సతీష్‌కు చుట్టుపక్కల వెతకాలని అనిపించడంపైనా ఆరా తీస్తున్నారు. క్లూస్‌ టీం బృందాలు ఆధారాలు సేకరించాయి.

Advertisement
 
Advertisement
Advertisement