దమ్ముంటే పట్టుకోండి | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే పట్టుకోండి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

సవాల్‌ విసురుతున్న దొంగలు

చీపురుపల్లి: వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్న దొంగలు.. మరో అడుగు ముందుకేసి దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. అదేదో మాట వరుసకు అన్నది కాదు... తాజాగా ఆదివారం రాత్రి ఓ చికెన్‌ దుకాణంలో చోరీకి పాల్పడిన ఆగంతకుడు ఓ పేపర్‌పై దమ్ముంటే పట్టుకోండంటూ తన ద్విచక్ర వాహనం నంబర్‌ కూడా రాయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే... చీపురుపల్లి పట్టణంలోని లావేరు రోడ్డులో ఓ చికెన్‌ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇదే దుకాణంలో ఏప్రిల్‌ 10న జరిగిన చోరీలో రూ.32వేలు నగదు అపహరణకు గురైంది. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా సోమవారం తెల్లవారుజామున జరిగిన చోరీలో రూ.5వేలు వరకు అపహరించి దమ్ముంటే పట్టుకోండని ఓ కాగితంపై రాసి సవాల్‌ విసిరాడు ఆ దొంగ. మెయిన్‌రోడ్డులోనే వరుస దొంగతనాలు జరుగుతున్నా.. సీసీ కెమెరాల్లో అగంతకుడు స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు కేసు చేధించలేకపోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నేడు ఎస్సీ కమిషన్‌ సభ్యుల పర్యటన

విజయనగరం అర్బన్‌: జిల్లాలో వివిధ భూ సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయి విచారణ జరిపేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో ఏపీ షెడ్యూల్‌ కులాల కమిషన్‌ సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. 7న ఉదయం 10గంటలకు రాజాం చేరుకొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం మాధ్యాహ్నం 2.30 గంటల నుంచి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాజాంలో రాత్రి బసచేస్తారు. 8న ఉదయం 8 గంటలకు రాజాం నుంచి బయలుదేరి 10.30 గంటలకు మారేడుబాక, మధ్యాహ్నం 3.30 గంటలకు వేపాడ మండలం బొద్దాం గ్రామాల్లో పర్యటించి ఫిర్యాదుదారుల భూములను పరిశీలించి విచారణ చేపడతారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల నుంచి ఎస్సీ కాలనీలు, వసతి గృహాలను సందర్శిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement