హోటల్స్‌కు గుదిబండ..! | - | Sakshi
Sakshi News home page

హోటల్స్‌కు గుదిబండ..!

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

సంక్షోభంలో హోటల్స్‌ రంగం ఏకంగా సిలిండర్‌పై రూ.993 పెంపు

ప్రస్తుతం వాణిజ్య సిలిండర్‌ ధర రూ.3,315లు జిల్లాలో వాణిజ్య సిలిండర్లు సంఖ్య: 30,000

ఏడాదికి రూ.60 కోట్ల వరకు భారం కేటరింగ్‌, హోటళ్లపై పెనుభారం

ధరల పెంపు హోటల్‌ రంగానికి ముప్పు

జాతీయ ఆయిల్‌ కంపెనీలు, ప్రభుత్వం మే 1 నుంచి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను భారీగా పెంచడం హోటల్‌ రంగానికి పెను ప్రమాదంగా మారింది. హోటల్‌ నిర్వహణ క్లిష్టతరం. ఈ ఏడాది మార్చి1 నుంచి మే 1వ తేదీ వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.1,320 వరకు సుమారు 81 శాతం ధర పెరిగింది. ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే బంద్‌కు పిలుపునిస్తాం.

– జి.శ్రీనివాసరావు, ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించడం కష్టమే...

వాణిజ్య సిలిండర్‌ ధర ఏకంగా రూ.993 పెరిగింది. దీంతో సిలిండర్‌ ధర రూ.3,315 అయ్యింది. అంత ధర పెట్టి వాణిజ్య సిలిండర్‌ పెట్టి టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించాలంటే కష్టమే. ఒక వేళ నిర్వహించినా టిఫిన్‌ ధరలు పెంచాల్సి వస్తుంది. వినియోగదారులు తగ్గితే నష్టం తప్పదు.

– రమణ, టిఫిన్‌ సెంటర్‌ నిర్వాకుడు, విజయనగరం

విజయనగరం ఫోర్ట్‌/విజయనగరం:

నిన్న, మొన్నటి వరకు గృహవినియోగదారులతో పాటు వ్యాపారులకు వాణిజ్యసిలిండర్లు దొరకని పరిస్థితి. వాణిజ్య సిలిండర్ల కొరతతో చాలా హోటల్స్‌, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మూతపడ్డాయి. కొన్నిచోట్ల నడిచినా భోజనం, బిర్యానీ, టిఫిన్‌ ధరలు అమాంతం పెంచేశారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతుందనుకుంటున్న తరుణంలో ఎద్దుపుండు మీద కారం చల్లిన సామెత చందాన వాణిజ్య సిలిండర్‌ ధరను ప్రభుత్వం అమాంతం పెంచడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. దీంతో వారి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్ల నిర్వహణ గుది‘బండ’గా మారింది.

రూ.కోట్లలో భారం..

వాణిజ్య సిలిండర్‌ (కమర్షియల్‌) ధర రూ.2,322 ఉండేది. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.993కు పెంచింది. దీంతో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.3,315కు చేరింది. ఏకంగా ఒకేసారి రూ.993 పెరగడంతో వాణిజ్య సిలిండర్లు వినియోగించేవారు నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. జిల్లాలో 30 వేలు వరకు వాణిజ్య సిలిండర్లు ఉన్నాయి. వాణిజ్య సిలిండర్లు కొంతమందికి నెలకు ఒకటి రెండు వినియోగిస్తారు. మరి కొంతమంది నెలకు 10 వరకు వినియోగిస్తారు. వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారిపై నెలకు రూ.5 కోట్లు వరకు, ఏడాదికి రూ.60 కోట్లు వరకు భారం పడనుంది.

హోటల్‌ నిర్వహణకు గడ్డు పరిస్థితి

వాణిజ్య సిలిండర్‌ ధర భారీగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌, బిర్యానీ సెంటర్ల నిర్వహణ కష్టతరంగా మారింది. రూ.3,315 పెట్టి వాణిజ్య సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు నిర్వహించాలంటే అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ కష్టమీద నడిపినా ధరలు అమాంతం పెరగడం కాయం. దీనివల్ల తినేవారు తగ్గితే నష్టాలు తప్పవని హోటల్‌ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రెండు ఇడ్లీ రూ.30, మినపదోశ రూ.50, మినప ఉల్లి దోస రూ.60, కాయగూర భోజనం రూ.120కి, చికెన్‌ బిర్యానీ రూ.200 విక్రయిస్తున్నారు. వీటి ధరలు మరింత పెరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement