● డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్
రంజన్ మిశ్రా
● అధికారులతో సమీక్ష.. సంఘాల
నుంచి వినతుల స్వీకరణ
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం సుప్రీంకోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ శనివారం జిల్లాలో పర్యటించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల అమలులో ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) అత్యంత కీలకమని స్పష్టం చేశారు. బీసీ కులాల డేటా మ్యాపింగ్‌లో ఎటువంటి తారతమ్యాలు లేకుండా కచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లు, మొత్తం సీట్లలో వారి ప్రాతినిధ్య నిష్పత్తి వివరాలను వెంటనే అందజేయాలన్నారు. సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత పారదర్శకత కోసం గ్రామ సభలు నిర్వహించి డేటాను సరిచూసుకోవాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కుటుంబ సర్వే ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సర్వే నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డెడికేటెడ్ కమిషన్ సెక్రటరీ డి.చంద్రశేఖర్‌రాజు, ఏఎస్పీ పి.సౌమ్యలత, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, బీసీవెల్ఫేర్ అధికారులు జె.జ్యోతిశ్రీ, ఇ.అప్పన్న, సీపీఓ పి.బాలాజీ, డీపీఓ మల్లిఖార్జున, ఏడు మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.
● వెనుకబడిన తరగతుల జనాభా దామాషాను ఆధారంగా తీసుకుని స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని విజయనగరం నాగవంశ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అవనాపు విక్రమ్ కోరారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు కాళ్ల గౌరీశంకర్, సముద్రపు రామారావు, అవనాపు సత్యనారాయణ, రామసింగు సత్యప్రసాద్, తదితరులతో కలిసి కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు.
● జిల్లాలో ఉన్న బీసీల్లో అధిక శాతం కొప్పుల వెలమ కులం ప్రజలున్నారని, వారిలో పేదకుటుంబాలే అధికమని, కులస్తులకు బీసీ–డి కేటగిరీ నుంచి బీసీ–బీ/ఏ కేటగిరీలోకి మార్చాలని కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.
● బీసీ–డి కులధ్రువపత్రాల జారీ విషయంలో జిల్లాల వారీగా వివక్ష కొనసాగుతోందని పట్టణ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ మిశ్రాకు వినతి పత్రం సమర్పించారు.


