● సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి
● హాజరు కానున్న 1,824 మంది అభ్యర్థులు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఆదివారం నిర్వహిస్తున్న నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై శనివారం సమీక్ష నిర్వహించిన ఆయన జిల్లాలోని 6 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. మొత్తం 1,824 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని చెప్పా రు. పరీక్ష నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండాలంటే పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే మధ్యాహ్నం 1 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్ధం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షకు సంబంధించి సందేహాలు ఉన్న వారు 08922–236947 నంబరుకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు.
బాల్య వివాహాలు నిరోధించాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: బాల్యవివాహాల నిరోధంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం కిశోర బాలబాలికల కోసం రూపొందించిన కిశోరీ వికాసం సమ్మర్ క్యాంపెయిన్–2020 వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఒకటి నుంచి 9వ తేదీ వరకు క్యాంపెయిన్ ఉంటుందన్నారు. క్యాలెండర్ ప్రకారం కిశోర బాలలకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, రక్తహీనత నివారణ, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. పోక్సో, బాల్యవివాహాల నిరోధక చట్టం, గృహహింస నిరోధక చట్టం, విద్యాహక్కు చట్టం పనితీరును వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారిణి కె.వి. బాలామణి, జిల్లా బాలల సంరక్షణ అధికారులు బి.హెచ్.లక్ష్మి, బి.రామకోటి, వై. నాగరాజు, కె.జయలక్ష్మి, వి.సంధ్యకుమారి, జి.రజని, ఆర్.సరస్వతి, చంద్రమౌళి, అరుణ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
శుభకార్యానికి వెళ్తుండగా..
అనంతలోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో వంట మాస్టర్ మృతి
ఆనందపురం: విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన గెడ్డపు ఈశ్వరరావు(32) శనివారం మధ్యాహ్నం గుడిలోవ సమీపంలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో మృతి చెందాడు. విజయవాడలోని ఒక రెస్టారెంట్‌లో ఆయన వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తుండగా.. ఎన్‌హెచ్–16పై ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో దుర్మరణం చెందాడు. అతనికి భార్య, పాప, బాబు ఉన్నారు. ఆనందపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈశ్వరరావు తలి సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐవాసునాయుడు కేసు నమోదు చేశారు.


