విజయనగరం అర్బన్: జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్ను జనగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. అమరావతి నుంచి రాష్ట్ర జనగణన నోడల్ అఽధికారి రావత్, స్టేట్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ నివాస్ కలెక్టర్‌తో గురువారం నిర్వహిచిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల వారీగా సన్నద్దతను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి చార్జ్ ఆఫీసర్, ఎన్యూమరేటర్ బాధ్యతగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటింటి గణన పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఎన్యూమరేటర్లకు తగిన శిక్షణ ఇచ్చి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించినట్టు తెలిపారు. రాబోయే మూడు రోజులు జనగణన ప్రక్రియలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌ఓ సీహెచ్ సత్తిబాబు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, సీపీఓ పి.బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ జనగణన ప్రక్రియను పర్యవేక్షించాలని లెక్కింపు కార్యక్రమాన్ని వీడియో రికార్డు చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో 08922–236947 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి జనగణనపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.


