
కంది పప్పు మార్కెట్‌లో రూ.140
బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. వీటిలో కందిపప్పు ధర మరింత ఎక్కువగా ఉంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు వీటి కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం గడిచిన మూడు నెలలుగా రేషన్ సరుకుల్లో కంది పప్పుకు కోత పెట్టింది. బియ్యం, పంచదారతో సరిపెట్టేసింది. మూడు నెలలుగా కంది పప్పు రేషన్ ద్వారా అందుతుందని ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగులుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి పాలకులపై లబ్ధిదారులు రుసరుసలాడుతున్నారు.
విజయనగరం ఫోర్ట్:
ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని రకాల రేషన్ సరుకులు సరఫరా చేస్తామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలకు దిక్కు లేకుండా పోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపీణి చేసే సరుకుల్లో కోత పెట్టి ప్రజలకు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. దీంతో విస్తుపోవడం ప్రజల వంతు అయింది. గత కొద్ది నెలలుగా ప్రజలకు అందించాల్సిన కందిపప్పును కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రజలు బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. మార్కెట్లో కంది పప్పు ధర చూస్తే భగ్గుమంటోంది. దీన్ని కొనుగోలు చేయలేని స్థితిలో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది భారం అయినప్పటికీ తప్పని పరిస్థితి.
● హామీల అమలు ఉత్తిదే..
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. కానీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు చొప్పన అందిస్తామని కూటమి నేతలు చెప్పారు. ఇంతవరకు అమలు చేసిన దాఖలాలు లేవు. రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా మార్చి రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని గొప్పగా చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. 11 నెలలైనా అమలు చేయలేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు రూ.1500 ఇస్తామని చెప్పారు. ఒక్క మహిళకు అమలు చేసిన పాపాన పోలేదు.
● 5,71,354 రైస్ కార్డులు
జిల్లాలో 5,71,354 రైస్‌కార్డులు ఉన్నాయి. వీరికి ఒక నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. మార్చి నెల నుంచి కంది పప్పు సరఫరా నిలిచిపోయింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.11.48 కోట్ల వరకు భారం తగ్గింది. కోట్లాది రుపాయిల భారం తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి సర్కార్ కందిపప్పు సరఫరా నిలిపివేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు పప్పు దినుసులు అందులోనూ కందిపప్పు ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పడు అది కూడా పేదలకు అందే పరిస్థితి లేదు. దీంతో బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనుగోలు చేయలేక.. ఇటు ప్రభుత్వం సరఫరా చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రైస్ కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైస్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయని, కందిపప్పు ధర మరింత ఎక్కువగా మార్కెట్‌లో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రేషన్ సరుకుల్లో కందిపప్పును మళ్లీ సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.
కేటాయింపుల్లేవు..
రైస్ కార్డుదారులకు కందిపప్పుకు సంబంధించి ఎటువంటి కేటాయింపుల్లేవు. ఈ ఏడాది మార్చి నెల నుంచి సరఫరా కాలేదు.
– బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లై శాఖ
మూడు నెలలుగా నిలిచిపోయిన
కందిపప్పు సరఫరా
ఎన్నికల వేళ గొప్పలు...తరువాత చుక్కలు
జిల్లాలో 5,71,354 రైస్ కార్డులు
నెలకు వీరికి అందించాల్సిన కందిపప్పు 571.354 మెట్రిక్ టన్నులు
రూ.11.48 కోట్లు మిగుల్చుకున్న ప్రభుత్వం
రేషన్ బియ్యం, పంచదారతో సరి
రైస్ కార్డులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులను పంపిణీ చేస్తుంది. అయితే కూటమి సర్కార్ గత మూడు నెలలుగా బియ్యం, పంచదార (అర కేజీ)తో సరిపెడుతుంది. కందిపప్పు పంపిణీ నిలిపివేసింది. దీంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు.
బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.140 వరకు ఉంది. రేషన్ షాపుల్లో రాయితీపై కేజీ రూ.67లకు చొప్పన ఇచ్చేవారు. రేషన్ షాపుల్లో తక్కువ ధరకు లభించడంతో కార్డుదారులు కొనుగోలు చేసే వారు. అయితే ఈ ఏడాది మార్చి నెల నుంచి కంది పప్పు సరఫరా కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. దీంతో రైస్ కార్డు
లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.

కంది పప్పు మార్కెట్‌లో రూ.140

కంది పప్పు మార్కెట్‌లో రూ.140