
ఆకలితో అలమటిస్తున్నా... కనికరించరా...!
నా పేరు పిల్ల బుచ్చమ్మ. మాది పూసపాటిరేగ గ్రామంలోని భూడి వీధి. నా భర్త పిల్ల బంగారప్పడు గత ఏడాది జూన్ నెలలో మృతి చెందాడు. అప్పటి నుంచి కనిపించిన ప్రతి ఒక్క అధికారిని, నాయకులని పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నాను. నా మొర ఆలకించడం లేదు. వృద్ధాప్య పింఛన్, వితంతువు పింఛన్‌కు అర్హత వుంది. కనీసం ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. పింఛన్ కోసం తిరిగి తిరిగి శక్తి సన్నగిల్లింది. ఎలా బతకాలో తెలియడం లేదు.
– పిల్ల బుచ్చమ్మ, భూడి వీధి, పూసపాటిరేగ
పూసపాటిరేగ:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా.. కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకోవడానికి కనీసం వెబ్‌సైట్ తెరవలేదు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నెలలుగా పింఛన్లు మంజూరు కాక ఆశతో ఆకలితో ఎదురు చూస్తున్నారు. భర్త చనిపోతే అదే నెలలో స్పౌజ్ కోటాలో అనుమతిచ్చి, ఏడాది కాలంగా భర్త చనిపోయి ఎటువంటి ఆదరణకు నోచుకోని మహిళలు పింఛన్‌కు నోచుకోకపోవడం తీవ్ర అన్యాయమని వితంతువులు వాపోతున్నారు. వందల సంఖ్యలో వితంతువులకు పింఛన్ అందక కనీసం మందుల ఖర్చుకు కూడా డబ్బుల్లేక అల్లాడుతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత వున్న ప్రతి ఒక్కరికి వలంటీర్లు దరఖాస్తు చేసిందే తడువుగా పింఛన్ మంజూరయ్యేది. ఇప్పుడు పరిస్థితి చూస్తే సంక్షేమ పథకాలు దేముడెరుగు కనీసం సామాజిక పింఛన్లు అయినా మంజూరు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో సుమారు 3200 మంది అర్హులైన పింఛన్‌దారులు వున్నారు. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయాలు చుట్టూ వందలాది మంది అర్హులైన వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. పూసపాటిరేగ గ్రామంలో భర్త చనిపోయి ఏడాది దాటుతున్నా పిల్ల బుచ్చమ్మ, బెల్లాన రాములమ్మ, జలమాదుల సరస్వతి అనే మహిళలకు పింఛన్ మంజూరు కాలేదు. దీంతో వీరు బతుకు జీవనంతో పడరాని పాట్లు పడుతున్నారు. అలాగే కుమిలి గ్రామంలో కోండ్ర లక్ష్మి, ఉప్పాడ అసిరమ్మ, బూర్లె అప్పయ్యమ్మ, పొట్నూరు రమణమ్మతో పాటు పలువురు ఇలానే పింఛన్ మంజూరు కాక ఆవేదన చెందుతున్నారు. ఇలా అర్హత వున్న ఎంతో మంది పింఛన్‌కు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళ్లినా వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని వెనక్కి పంపిస్తున్నారు. గతంలో పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి నిరంతరాయంగా వెబ్‌సైట్ ఓపెన్ అయి వుండేది. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా వుంది. ఓ వైపు కొత్త పింఛన్లు మంజూరు చేయకుండానే మరోవైపు వున్న పింఛన్‌లు ఊడ దీయడానికి గ్రామాలలో సర్వేలు చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అర్హులకు పింఛన్‌లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
నా గోడు పట్టదా..
నా పేరు బెల్లాన రాములమ్మ. మాది పూసపాటిరేగ గ్రామం. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు ఎటువంటి ఆదరణ లేదు. నా భర్త బెల్లాన బుల్లి మరణించి ఏడాది దాటింది. నాకు వితంతవు పింఛన్, వృద్ధాప్య పింఛన్‌కు అర్హత వుంది. కానీ ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. కనిపించిన అధికారులు, ప్రజాప్రతినిధులను ఏడాదిగా వేడుకుంటున్నా.. ఫలితం దక్కలేదు. దిక్కులేని కుటుంబాలకు దేవుడే దిక్కు అనుకుంటే ఆ ఆశ కూడా సన్నగిల్లింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హత వున్న పింఛన్ దక్కలేదు.
– బెల్లాన రాములమ్మ, రాజా వీధి, పూసపాటిరేగ
అర్హత ఉన్నా సామాజిక పింఛన్ అందని వైనం
గొల్లుమంటున్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు
ఏడాదిగా తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు
దరఖాస్తు చేసుకునేందుకు తెరుచుకోని వెబ్‌సైట్

ఆకలితో అలమటిస్తున్నా... కనికరించరా...!

ఆకలితో అలమటిస్తున్నా... కనికరించరా...!

ఆకలితో అలమటిస్తున్నా... కనికరించరా...!