
14న ఏపీటీఎఫ్ రాష్ట్ర స్థాయి ధర్నా
బొబ్బిలి: పాఠశాల విద్యలో అసంబద్ధ విధానాలను వెంటనే సరిచేయాలని కోరుతూ ఈ నెల 14న విజయవాడ ధర్నా చౌక్‌లో చేపడుతున్న రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడెమిక్ కన్వీనర్ జేసీ రాజు పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ స్థానిక కార్యాలయంలో సీహెచ్ ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వానికి ప్రయోగశాలలుగా మారాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం అంచెల వారీ పాఠశాలలను నడిపితే ఈ ప్రభుత్వం పోటీగా 9 రకాల పాఠశాలల అమలుకు సన్నాహాలు చేస్తోందని విమర్శించారు. ఒక్కో పాఠశాలకూ ఒక్కో నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులుండాలనే షరతులున్నాయన్నారు. సమావేశంలో గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు, రమేష్, నాగేశ్వరరావు, చిన్నారావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెండింగ్ నీటి ప్రాజెక్టులు
పూర్తి చేయాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలో పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశా రు. స్థానిక ఎన్జీవో హోంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ నీటి ప్రాజెక్టులపై ఆదివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటి ప్రాజెక్టులపై రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపారు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న జంఝావతి, అడారుగెడ్డ, కారిగెడ్డ, వనకబడి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు నిధులు నిల్‌గానే ఉన్నాయని దుయ్యబట్టారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి అధికారులు రూ.590 కోట్లు ప్రతిపాదించగా ఉద్యోగుల భత్యం కోసం రూ.47 కోట్లు విడుదల చేసిందని ఇది చాలా అన్యాయమని దుయ్యబ ట్టారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని పోరాడి తిప్పికొట్టాలని అందుకు తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసితుల, రైతుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగమే ముందుగా రైతులు సంతకాలు చేసి గ్రామ సచివాలయాల వద్ద మే 21 నుంచి 24 వరకు నిరసనలు తెలియజేసి వినతులు అందిస్తామని, అనంతరం ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులో రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు, కరణం రవీంద్ర, రైతులు పాల్గొన్నారు.