
ఐసీడీఎస్‌లో షటిల్ సర్వీసెస్..!
విజయనగరం ఫోర్ట్:
ఐసీడీఎస్ శాఖలో పని చేస్తున్న కొందరు జిల్లా కేంద్రం, విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని సర్వత్రా చర్చ నడుస్తోంది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడం వల్ల కేంద్రాలపై పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను గాడిలో పెట్టాల్సిన అధికారులే దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడం వల్ల అంగన్‌వాడీలు కూడా సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ శాఖలో అధికారుల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తల వరకు చాలా మంది స్థానికంగా ఉండడం లేదనే విమర్శలు పెద్దెత్తున వినిపిస్తున్నాయి.
జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 293 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కాగా మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు 2206 కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 0 నుంచి 6 నెలలలోపు పిల్లలు 5,889 మంది ఉన్నారు. అదే విధంగా 7 నెలలు నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 39, 976 మంది ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలు 27,918 మంది ఉన్నారు.
దూర ప్రాంతాల నుంచి రాకపోకలు
అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేసేటప్పుడే స్థానిక నివాసిత అయి ఉండాలనే నిబంధన ఉంటుంది. అలా నియమించబడిన అంగన్‌వాడీ కార్యకర్తలు సైతం స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏ గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త ఆ గ్రామంలోనే నివాసం ఉండాలి. అయితే కొంతమంది జిల్లా కేంద్రం, మండల కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రాకపోకలు సాగించడం వల్ల వారి పరిధిలో ఉన్న పిల్లలకు, గర్బిణులకు, బాలింతలకు అందించాల్సిన సేవలు పూర్తి స్థాయిలో.. సకాలంలో అందడం లేదనే చర్చ జరుగుతోంది.
కొరవడుతున్న పర్యవేక్షణ
విశాఖపట్నం, జిల్లా కేంద్రం నుంచి పలువురు ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టులకు సీడీపీవోలు, సూపర్‌వైజర్లు రాకపోకలు సాగిస్తున్నట్టు విమర్శలున్నాయి. దీని వల్ల వారు అందించాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి విధి నిర్వహణలో రాకపోకలకే ఎక్కువ సమయం పడుతుంది. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు వారి పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలి. సమయ పాలన నుంచి పౌష్టికాహారం పంపిణీ వరకు ప్రతీది పర్యవేక్షించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. కానీ ఆ పరిస్థితులు చాలా చోట్ల లేవు. ఆన్‌లైన్ నమోదులో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని కార్యకర్తలకు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది. కానీ చాలా మంది సమయం దాటి పోయిన తరువాత వస్తుండడంతో విధి నిర్వహణలో ఉరుకులు, పరుగులు పెడితే సరిపోతుందన్న విమర్శలు లేకపోలేదు. మరెక్కడ సేవలు అందిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో కేంద్రాలు గాడి తప్పుతున్నాయని చాలా చోట్ల వినిపిస్తోంది.
పది కిలోమీటర్ల దూరం వరకు ఓకే...
ఐసీడీఎస్ శాఖలో పని చేసే వారు వారు పని చేసే ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరం వరకు ఉన్నా పరవాలేదు. అంతకు మించి దూరం నుంచి రాకపోకలు చేసేందుకు వీల్లేదు. అంగన్‌వాడీ కార్యకర్తలైతే వారు పని చేసే గ్రామాల్లోనే తప్పనిసరిగా ఉండాలి. అందరూ స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.
– రుక్సానా సుల్తానా బేగం,
పీడీ, ఐసీడీఎస్
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. బొబ్బిలి, బాడంగి, గజపతినగరం, విజయనగరం, గంట్యాడ, ఎస్.కోట, వియ్యంపేట, గరివిడి, చీపురుపల్లి, రాజాం, భోగాపురం ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి 11 మంది సీడీపీవోలు, ఒక ఏసీడీపీవో ఉన్నారు. అదే విధంగా 71 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. 2499 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 2499 మంది ఆయాలు ఉన్నారు.
స్థానికంగా ఉండని అధికారులు, కార్యకర్తలు
జిల్లా కేంద్రం, విశాఖ నుంచి రాకపోకలు
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు
2,499 అంగన్‌వాడీ కేంద్రాలు
స్థానికంగా లేకపోవడంతో పర్యవేక్షణ కరువు

ఐసీడీఎస్‌లో షటిల్ సర్వీసెస్..!