
పెరుమాళి పీఏసీఎస్‌లో దర్యాప్తు
తెర్లాం: పెరుమాళి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)పై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించామని, నివేదికను జిల్లా కలెక్టర్‌కు, తమ శాఖ ఉన్నతాధికారులకు అందజేస్తామని జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్ వెల్లడించారు. పెరుమాళి పీఏసీఎస్‌లో పలు అంశాలలో అవకతవకలు జరిగాయని శివరామరాజు అనే వ్యక్తి ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కొద్ది రోజుల క్రితం బొబ్బిలి సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి, పెరుమాళి పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జ్ పద్మజ దర్యాప్తు జరిపారు. ఆ దర్యాప్తు సక్రమంగా జరగలేదని శివరామరాజు మళ్లీ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్‌తో పాటు పలువురు అధికారులు పెరుమాళి పీఏసీఎస్‌కు వచ్చి బోర్డు సభ్యులు, రైతులు, ఫిర్యాదుదారుని సమక్షంలో దర్యాప్తు జరిపారు. ఫిర్యాదుదారుడు లేవనెత్తిన ప్రతీ అంశంపై వివరణ ఇచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండా పీఏసీఎస్ సీఈవో జీతం ఎందుకు పెంచారని, పెట్రోల్ బంక్‌లో పలు అవకతవకలు జరుగుతున్నాయని, రైతులకు ఇన్సెంటివ్‌లు ఇవ్వడం లేదని, ధాన్యం కొనుగోలు సమయంలో హమాలీలకు చార్జీలు ఇవ్వడం లేదని, రుణాలు మంజూరు చేసినప్పుడు కమీషన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. పలువురు బోర్డు సభ్యులు మాట్లాడుతూ పీఏసీఎస్‌లో రైతులకు ఎటువంటి సమస్యలు లేవని, రుణాలు సక్రమంగానే ఇస్తున్నారని, సీఈవో బాగానే పని చేస్తున్నారని దర్యాప్తులో తెలిపారు. అలాగే మరికొంత మంది సభ్యులు మాట్లాడుతూ పెరుమాళి పీఏసీఎస్‌లో క్షత్రియులకు తప్ప మిగిలిన కులాలకు ఎటువంటి పోస్టులు ఇవ్వడం లేదని వారంతా ఆరోపించారు. ఫిర్యాదుదారుడు, బోర్డు సభ్యులు తెలిపిన అంశాలన్నింటిపై సమగ్రంగా నివేదికను తయారు చేసి తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని ఈ సందర్భంగా డీసీవో తెలిపారు. దర్యాప్తులో డీఆర్ రమణమూర్తి, అకౌంట్స్ అధికారులు పద్మ, పి.పద్మ, పెరుమాళి పీఏసీఎస్ సీఈవో రమాదేవి, సూపర్‌వైజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆరోపణలపై జిల్లా కో ఆపరేటివ్ అధికారుల విచారణ
జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం..
జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్