
కౌంటింగ్ కేంద్రాల్లో తెలుగులో సూచిక బోర్డులు
● అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
విజయనగరం అర్బన్: ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలోని లెండి ఇంజనీరింగ్ కళాశాల, జెఎన్‌టీ యూ జీవీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రాజకీయ పార్టీల ఏజెంట్లు సులువుగా ఆయా నియోజక వర్గాల లెక్కింపు జరిగే ప్రదేశాలను గుర్తించేందుకు తెలుగులో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. అన్ని ఓట్ల లెక్కింపు హాల్‌లలో ఏసీ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన వసతుల కల్పన ఏర్పాట్లు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుంచి ఓట్ల లెక్కింపు హాల్‌కు తరలించేటప్పుడు సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వాటిని అమరుస్తున్న ఏజెన్సీ ప్రతినిధిని ఆదేశించారు. పత్రికా, మీడియా ప్రతిని ధులకు మీడియా సెంటర్ ఏర్పాటుపై ఆరా తీశా రు. ఈ పర్యటనలో డీఆర్‌ఓ ఎంవీ సూర్యకళ, మెప్మా పీడీ సుధాకర్, ఆర్‌అండ్‌బీ ఈఈ తదితరులు పాల్గొన్నారు.