
విజయనగరం ఫోర్ట్:
నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల భవనాల రూపురేఖలను జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది. కార్పొరేట్ పాఠశాలల కంటే మిన్నగా తీర్చిదిద్దింది. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను నాడు–నేడు ద్వారా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది . ఈ మేరకు ఆధునీకరించాల్సిన భవనాలను గుర్తించారు. వాటి పనులు చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసే పనిలో ప్రస్తుతం ఆ శాఖ అధికారులు ఉన్నారు. జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 786 కేంద్రాలు సొంత భవనాల్లో నడుస్తున్నాయి. 420 కేంద్రాలు సామాజిక కేంద్రాల్లో, 1293 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. సొంత, సామాజిక భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో 716 కేంద్రాలను ఆధునీకరించాలని గుర్తించారు. ఆ భవనాల్లో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేకపోతే ఏర్పాటు చేస్తారు. మరుగుదొడ్లు పాడైతే బాగు చేస్తారు. భవనం పాడైతే అత్యంత ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతారు. పిల్లలను ఆకట్టుకునేందుకు పెయింటింగ్ వేస్తారు. ఇలా అంగన్‌వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దనున్నారు.
గంట్యాడ మండలం పెదవేమలి అంగన్‌వాడీ భవనం
ప్రతిపాదనలు సిద్ధం
జిల్లాలో 761 భవనాలను నాడు–నేడు కింద గుర్తించాం. వాటిని ఆధునికీకరించేందుకు ఎంత మేర నిధులు అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.
బి.శాంతకుమారి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి