
నిర్వాహకులనుంచి బహుమతులు అందుకుంటున్న షూటింగ్ బాల్ క్రీడాకారులు
రాజాం సిటీ: రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీల్లో రాజాం నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు సత్తాచాటారు. ఈ నెల 8 నుంచి 10వరకు బాపట్ల జిల్లా మార్టూరులో అండర్–19 రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జట్టు తరఫున రాజాం నియోజకవర్గంలోని రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి మండలాలకు చెందిన బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాలికల జట్టు గుంటూరుతో తలపడి ద్వితీయస్థానం కై వసం చేసుకుంది. బాలుర జట్టు నాలుగవ స్థానంలో నిలిచినట్లు షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, మండవకురిటి పీడీ మండల గోవిందనాయుడు ఆదివారం తెలిపారు. వారి ప్రతిభ పట్ల షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ పాలవలస శ్రీనివాసరావు, పలువురు పీడీలు క్రీడాకారులను అభినందించారు. విజేతలు అక్కడి ఎమ్మెల్యే రావురి సాంబశివరావు చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారని పీడీ వెల్లడించారు.