
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న సీనియర్స్ మహిళల కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలో జరగనున్న పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున కె.రామలక్ష్మి, ఎం.భువన ప్రాతినిధ్యం వహించనున్నారు. గత నెలలో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి మహిళల అంతర్ జిల్లాల సీనియర్స్ కబడ్డీ పోటీల్లో జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానం దక్కించుకున్న విషయం విదితమే. జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన జిలా క్రీడాకారిణులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రంగారావు, కేవీ ప్రభావతిలు అభినందించారు.
బొలెరో ఢీకొని వ్యక్తికి గాయాలు
కొమరాడ: మండలంలోని కూనేరు రామభద్రాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయాల పాలైనట్లు స్థానికులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడ నుంచి వస్తున్న బొలెరో వాహనం పార్వతీపురం నుంచి బైక్‌పై ఎదురుగా వస్తున్న చందక సింహాచలాన్ని ఢీకొట్టింది. దీంతో సింహాచలం కుడికాలు విరిగిపోయింది. ఈ విషయం గమనించిన స్థానికులు పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కొమరాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైభవంగా ఆదిత్య హృదయ హోమం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం, ఆదిత్య హృదయ హోమం, తదితర కార్యక్రమాలను జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో సీతారాముల నిత్య కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీకమాసం ఆదివారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రామక్షేత్రానికి విచ్చేశారు. పలువురు ఔత్సాహిక భక్తులు బోడికొండపైకి వెళ్లి అలనాటి చారిత్రక ఆధారాలను తిలకించారు. దీంతో బోడికొండపై సందడి వాతావరణం కనిపించింది.

యాగశాలలో హోమం జరిపిస్తున్న అర్చకులు


జాతీయకబడ్డీ పోటీలకు ఎంపికై న రామలక్ష్మి, భువన