
తెగులు సోకిన చిక్కుడు పంటను దిగాలుగా చూపుతున్న రైతు
నష్టపోయాం..
పది సంవత్సరాలుగా కూరగాయల పంటలు సాగు చేస్తున్నాను.అందులో ఎక్కువగా పొట్టి చిక్కుడు సాగు చేస్తాను. వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల పంటకు ఇంతగా తెగులు సోకడం ఇదే మొదటసారిగా చూస్తున్నాను. క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా తెగులు, పురుగులు వదల లేదు. ఎకరా విస్తీర్ణంలో చిక్కుడు సాగుకు అప్పు చేసి రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. పంట చేతికొచ్చే సమయంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా అధిక వర్షాలు కురిసి తెగులు బెడద ఎక్కువై పంట పాడవడంతో అప్పుల పాలవుతున్నాను.
గెద్ద జగన్నాథం, రైతు,రామభద్రపురం
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు రామభద్రపురం గ్రామానికి చెందిన చింతల అప్పలనాయుడు. సుమారు రెండు ఎకరాలలో పొట్టి చిక్కుడు పంట సాగు చేస్తూ దాదాపు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టాడు.అయితే పంట చేతికందే సమయంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా తెగులు సోకి చూస్తుండగానే పంట పాడవడంతో పెట్టుబడి పోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నాడు. అధికంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కుటుంబమంతా ఆరుగాలం కష్టపడినా ప్రకృతి సహకరించడంలేదని నేల రాలిన చిక్కుడు పిందెలు చూపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
రామభద్రపురం: ఆరుగాలం కష్టపడినా అన్నదాతకు కాలం కలసి రావడంలేదు. కూరగాయల రైతులకు ప్రకృతి సహకరించడంలేదు.ఖరీఫ్ సీజన్ మొదట్లో విత్తిన విత్తనం మొలకెత్తకుండా వరుణుడు ముఖం చాటేయడం, తర్వాత అధిక వర్షాలు కురవడంతో నానా అవస్థలు పడుతూ సాగునీరందించి మొక్కను బతికించుకున్నారు. పంట చేతికందే సమయంలో రెండు నెలలుగా తీవ్ర వర్షాభావం నెలకొంది. దీంతో బోరుబావులు, నేలబావులలోని నీటిని కిరోసిన్ ఇంజిన్లతో తోడి అందించారు. రైతులు అప్పులు చేసి మదుపులు పెట్టి ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేస్తే మళ్లీ పూత వచ్చి పిందె కడుతుందన్న సమయంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వరుసగా మూడు రోజుల పాటు జోరుగా వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు చీడపీడలు, వైరస్ సోకడంతో కూరగాయ పంటలు బాగా దెబ్బతిని కోతకు వచ్చిన పంటంతా పోయింది. జిల్లాలోని ఖరీఫ్,రబీ సీజన్లలో దాదాపుగా 3 వేల హెక్టార్లలో కూరగాయల పంట సాగవుతోంది. రామభద్రపురం మండలంలో 400 నుంచి 500 హెక్టార్లలో సుమారు 2000 మంది రైతులు బీర, చిక్కుడు, వంగ, టమాటో, బెండ, కాకర, క్యాబేజీ వంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. అధికంగా కురిసిన వర్షాల కారణంగా కూరగాయ పంటలకు వివిద రకాల తెగుళ్లు సోకుతుండడంతో కూరగాయల్ని పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి విపత్తులకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు సైతం కోల్పోయే పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా సుమారు 500 మంది రైతులు ఆరుగాలం శ్రమించి పొట్టి చిక్కుడు 50 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. ఈపంట పూత,పిందె దశలకు చేరుకున్న సమయంలో కాండం తొలుచు పురుగు, వేరుకుళ్లుతెగులు, వివిధ రకాల చీడపీడలు ఆశించి నాశనం చేస్తోంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడి విలవిలలాడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు మొక్కలు ఎదుగుదల లేక, చనిపోతున్నాయి. అలాగే వేరుకుళ్లు తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోతూ, పూత పిందె రాలిపోతూ ఉంటుందని రైతులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే లోపే పాడవుతుందని వాపోతున్నారు. కొద్ది రోజుల్లో కోతకు వస్తుందనుదనుకుంటున్న తరుణంలో పంట తెగులు, పురుగు బారిన పడడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయ పంటలకు తెగులు,
పురుగు బెడద
వాపోతున్న రైతులు

తుఫాన్ ప్రభావంతో పూర్తిగా పాడైన చిక్కుడు పంట

