విజయనగరం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బి, మ్యాథ్ బి ప్రతిభా పరీక్షలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని కామాక్షినగర్ ప్రాంతంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ప్రతిభా పరీక్షకు అనూహ్య స్పందన లభించింది. ప్రెజెంటింగ్ స్పాన్సర్ డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్ ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో నిర్వహించిన పరీక్షలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభకు పదును పెట్టుకున్నారు. 1, 2 తరగతుల విద్యార్థులకు కేటగిరీ–1 విభాగంలో, 3,4 తరగతుల విద్యార్థులు కేటగిరి–2 విభాగంలో 5,6,7 తరగతుల విద్యార్థులకు కేటగిరి–3 విభాగంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు కేటగిరి–4 విభాగంలో పరీక్ష నిర్వహించారు. ఆదివారం క్వార్టర్ ఫైనల్స్ విభాగంలో నిర్వహించిన స్పెల్ బి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రీజనల్ స్థాయిలో నిర్వహించే ఫైనల్స్‌కు అర్హత సాధించనున్నారు. అదేవిధంగా సెమిఫైనల్స్‌లో విభాగంలో నిర్వహించిన మ్యాథ్ బి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఫైనల్ పరీక్షకు ఎంపికకానున్నారు. ఈ పరీక్షలను శ్రీ చైతన్య విద్యా సంస్థల రీజనల్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ జ్యోతి, డీన్ జామి చిన్న పర్యవేక్షించారు.