
విజయనగరం అర్బన్: ప్రజా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆహార పంటల సాగు లాభదాయకమని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. అన్ని రకాల పంటలకు గిట్టుబాబు ధర లభించేలా చూడాలన్నారు. జిల్లాకు శుక్రవారం వచ్చిన ఆయన జేసీ చాంబర్‌లో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పంటల సాగు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు, బిల్లుల చెల్లింపు, బీమా పరిహారాల అందజేత తదితర అంశాలపై చర్చించారు. గత సీజన్ నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ, ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరును జేసీ మయూర్‌అశోక్ వివరించారు. గత సీజన్లో జరిగిన ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రవాణా భత్యంను చెల్లించాలని సివిల్ సప్లయి డీఎంను ఆదేశించారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, చిరుధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ముందుగా విజయనగరం మండలం కొండకరకాంలోని గోధు పిండి మిల్లును పరిశీలించారు. సమావేశంలో జేసీ కె.మయూర్‌అశోక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామారావు, డీఎస్‌ఓ మధుసూదనరావు, సహకార అధికారి రమేష్, వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.