
వివరాలు వెల్లడిస్తున్న వన్‌టౌన్ సిఐ బి.వెంకటరావు (వెనుక ముసుగులో నిందితులు)
విజయనగరం క్రైమ్: బట్టల షాపులో చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను వన్‌టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బట్టలు, నగదు రికవరీ చేశారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు సోమవారం స్థానిక కార్యాలయంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక బాలాజీ మార్కెట్‌లో షాప్ నంబర్ 304 యజమాని అరుణ్‌కుమార్ అగర్వాల్ ఈ నెల 23న రాత్రి షాపు మూసేసి ఇంటికి వెళ్లిపోయారు. ఎవరో గుర్తు తెలియని దొంగలు మారుతాళంతో షాప్ షట్టర్ తీసి, లోపలికి ప్రవేశించి దఫదఫాలుగా సుమారు రూ.లక్షా 90వేలు విలువైన బట్టల మూటలు దొంగిలించి పారిపోయినట్లు గుర్తించిన యజమాని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడిన బొండపల్లి మండలం జియ్యన్నవలసకు చెందిన చుక్క, పడాల శంకర్, ఎర్రశ్రీను, పట్నాన అప్పలనాయుడులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 75వేల నగదు, పది బట్టల మూటలను రికవరీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు ఛేదించడంలో క్రియాశీలకపాత్ర పోషించిన ఎస్సైలు అశోక్ కుమార్, భాస్కరరావు, హెచ్‌సీ అచ్చిరాజు, సిబ్బందిని సీఐ అభినందించారు.
నేడు పోలమాంబ ఆఖరు జాతర
మక్కువ: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆఖరు జాతర(పదో జాతర) మంగళవారం జరగనుంది. ఆఖరు జాతర కావడంతో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున ఈఓ వి.రాధాకృష్ణ, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పూడి దాలినాయుడు, కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే చదురుగుడి ఆలయం వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ తెలిపారు.

పోలమాంబ అమ్మవారు