
అర్జీలను స్వీకరిస్తున్న జేసీ మయూర్ అశోక్, డీఆర్‌ఓ గణపతిరావు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమానికి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 163 అర్జీలు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 123 అర్జీలు అందాయి. హౌసింగ్‌కు సంబంధించి 10, మున్సిపల్ శాఖ 7, వైద్యశాఖ 6, సచివాలయాలకు సంబంధించి 11 అందగా మిగిలినవి పింఛన్లు, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు తదితర సమస్యలపై వినతులు అందాయి. స్పందన కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, డీఆర్‌ఓ గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు సూర్యనారాయణ, సుదర్శనదొర పాల్గొని వినతులు స్వీకరించారు.
కనీస వేతనం అమలు చేయాలి
ఆర్టీసీలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి, అద్దెబస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ఆ సిబ్బంది సంఘం డిమాండ్ చేసింది. సంఘం జిల్లా కమిటీ, సీఐటీయూ సంయుక్తంగా స్థానిక కలెక్టరేట్ ఎదుట ఈ మేరకు సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని జేసీ మయూర్ అశోక్‌కు అందజేశారు.
దూరవిద్య కేంద్రాన్ని ఎంఆర్ కళాశాలలో కొనసాగించాలి
పట్టణంలోని మహరాజా అటానమస్ కళాశాలలోనే ఆంధ్రయూనివర్సిటీ దూర విద్యా కేంద్రాన్ని కొనసాగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.
స్పందన పిర్యాదులపై తక్షణ చర్యలు
విజయనగరం క్రైమ్: స్పందనలో ప్రజల నుంచి అందుకున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామని ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో భాగంగా ప్రజల నుంచి ఆమె 26 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషిచేయాలని, తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని ఆదేశాలు జారీచేశామని చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ సీహెచ్.రుద్రశేఖర్, డీసీఆర్‌బీ ఎస్సైలు వాసుదేవ్, ప్రభావతి, ఆర్‌ఎస్సై నీలిమ తదితరులు పాల్గొన్నారు.

బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ ఎం.దీపిక