
అర్జీదారులతో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్
పార్వతీపురం: స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయనతో పాటు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి.విష్ణుచరణ్, డీఆర్‌డీఏ ఏపీడీ అప్పలనాయుడు పాల్గొని ప్రజల నుంచి 110 అర్జీలను స్వీకరించారు.
అర్జీల వివరాలు ఇలా..
గ్రామానికి రోడ్డు సౌకర్యం లేనందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని జియ్యమ్మవలస మండలం అర్నాడవలస గ్రామానికి చెందిన ఎం.సురేష్ కోరారు.
● పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో లంకెల చెరువు మీద ఆధారపడి కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, లంకెల చెరువును ఆక్రమణ దారుల నుంచి కాపాడి ఆయుకట్టుదారులకు నీటి సదుపాయం కల్పించాలని జె.ప్రసాద్, తదితర రైతులు దరఖాస్తు అందజేశారు.
రెండు సంవత్సరాలుగా తన కుమార్తెకు అమ్మఒడి అందడం లేదని కొమరాడ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన జి.గంగ వినతి పత్రం సమర్పించింది.
జియ్యమ్మవలస మండలం దంగభద్ర గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ఇచ్చే పాలు, గుడ్లు సక్రమంగా ఇవ్వడం లేదని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్.ఉపేంద్ర వినతిపత్రం అందజేశాడు.
కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ బి.జగన్నాథ రావు, డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్ కుమార్, జిల్లా పీఆర్ ఈఈ ఎంవీజీ కృష్ణాజీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఒ. ప్రభాకర రావు, డ్వామా పీడీ కె. రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై తక్షణ చర్యలు
పార్వతీపురంటౌన్: స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపడుతున్నామని జిల్లా అదనపు ఎస్పీ ఒ.దిలీప్ కిరణ్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన చట్ట పరిధిలో ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో దిశ డీఎస్పీ హరితచంద్ర, ఎస్బీ సీఐ ఎన్.శ్రీనివాస రావు, ఎస్సై దినకర్ పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆనంద్

వినతులను స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఆనంద్