
చెరువు ఉన్న ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణం
బొబ్బిలి: పట్టణంలోని తారక రామా కాలనీని ఆనుకుని ఉన్న 2.61 ఎకరాల చీపురుబందను రియల్టర్లు ఆక్రమించి వారి లే ఔట్‌కు దారి వేస్తున్నారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని మల్లంపేట సర్వే నంబర్ 71లో తారకరామా కాలనీ ఎదురుగా ప్రభుత్వ చెరువు చీపురుబంద ఉంది. షాదీఖానా ఎదురుగా వేసిన ఓ ప్రైవేట్ లేఔట్‌కు నేరుగా రాయగడ రోడ్డుకు లింకు రోడ్డు వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల ఆ లేఔట్ అత్యధిక ధరలకు విక్రయించుకునేందుకు రియల్టర్లు పన్నాగం పన్నారంటున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రియల్టర్లకు కొమ్ము కాసేందుకు ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మించడం దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత త్వరగా రోడ్డు నిర్మించడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజలకు అవసరం లేని చోట ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మించి రియల్టర్లకు లబ్ధి చేకూర్చుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, మండల నాయకులు కోట అప్పన్న ఆరోపించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎస్. శ్రీనివాసరావును వివరణ కోరగా చెరువు ఆక్రమణ జరగలేదని, పాత ప్రతిపాదనలున్న చోట రహదారి నిర్మిస్తున్నామని, ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు, ఇతర నిర్మాణాలు ఆక్రమణలకు గురి కాకుండా ఉంటుందని ప్రజలకు పనికి వచ్చే సీసీ రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు.