కాలువ పూడికలో రూ.78 లక్షల ‘మురుగు’
కొమ్మాది–కార్‌షెడ్ మధ్య పేరుకే పనులు.. తీరని కష్టాలు..
మధురవాడలో జీవీఎంసీ నిధుల స్వాహా!
అక్కడ కాలువ కట్టలేదు.. కనీసం కొత్త స్లాబులు వేయలేదు. కానీ బిల్లులు మాత్రం అక్షరాలా రూ.78 లక్షలు! మధురవాడ జోన్‌లో జీవీఎంసీ నిధుల దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. కొమ్మాది–కార్‌షెడ్ జంక్షన్ల మధ్య పూడిక తీత పనులు ‘కాసుల వర్షం’ కురిపించగా.. సామాన్య జనం మాత్రం చిన్నపాటి వర్షానికే మురుగు నీటిలో నానుతున్నారు. ఇది ఇంజనీరింగ్ అద్భుతమో లేక పాలకుల ‘పంపిణీ’ పథకమో అర్థం కాక స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోన్‌లో ప్రజాధనం పక్కదారి పట్టింది. కేవలం కాలువల్లో పూడిక తీయడానికే రూ. 78 లక్షలు ఖర్చు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తీరా సమస్య పరిష్కారమైందా? అంటే అదీ లేదు. దీంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి పాలకులు, అధికారులు కుమ్మకై ్క సామాన్యుల పన్నుల సొమ్మును కాలువ పాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలువ నిర్మాణానికి ఖర్చయ్యే నిధులను కేవలం చెత్త తీయడానికే వెచ్చించడం గమనార్హం.
పేరుకే పనులు.. తీరని కష్టాలు
సుమారు 25 ఏళ్ల క్రితం జాతీయ రహదారి నిర్మాణ సమయంలో కొమ్మాది జంక్షన్ నుంచి కార్‌షెడ్ జంక్షన్ వరకు సర్వీసు రోడ్డును ఆనుకుని భారీ కాలువలు నిర్మించారు. ఈ కాలువలపై ఉన్న స్లాబులు కాలక్రమేణా ధ్వంసం కావడంతో మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోయి నీరు ప్రవహించే దారి లేకుండా పోయింది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ కాలువల్లో పూడిక తొలగించేందుకు రూ. 78 లక్షలతో పనులు చేపట్టారు. అయితే, ఇంత భారీ మొత్తాన్ని కేవలం పూడిక తీతకే కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. పనులు జరిగిన సమ యంలో పగిలిపోయిన స్లాబులను బాగు చేయడం గానీ, కొత్తవి వేయడం గానీ చేయకుండా.. కేవలం చెత్త తీసినట్లు లెక్కలు చూపి నిధులు మ ళ్లించార నే విమర్శలు వినిపిస్తున్నాయి. అ ప్పట్లో జరిగిన ఖర్చు వివ రాలు ఇప్పటివరకు బయటకు రాకుండా గోప్యంగా ఉంచడం మరి న్ని అనుమానాలకు తావిస్తోంది.
మొదటికే వచ్చిన సమస్య
ఇంత భారీ ఖర్చుతో పనులు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే మధురవాడ అప్ బ్రిడ్జి ప్రాంతం మళ్లీ చెరువులా మారిపోయింది. కార్‌షెడ్, మిథిలాపురి ఉడా కాలనీ, చంద్రంపాలెం, శివశక్తినగర్ జంక్షన్ల వద్ద వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవించారు. పూడిక తీసినట్లు రికార్డులు చెబుతున్నా, నీటి ప్రవాహం ఎందుకు ఆగడం లేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
సమగ్ర విచారణ జరపాలి
కూటమి పాలకులు కేవలం చెత్త తొలగింపు పేరుతో రూ.78 లక్షల ప్రజాధనం వెచ్చించారు. కనీసం స్లాబులు కూడా వేయకుండా పూడికతీత పేరుతో నిధులు నొక్కేశారు. ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తక్షణమే విచారణ జరపాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. –డి. అప్పలరాజు, సీపీఎం నాయకుడు


