ప్రజల భూములను గూగుల్‌కు కట్టబెట్టడం విడ్డూరం
పర్యావరణం దెబ్బతింటుంటే మంత్రిపవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు?
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సూటి ప్రశ్న
సింహాచలం: పంచగ్రామాల భూ సమస్యకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని, 1996–97లో ఆయన సీఎంగా ఉన్నప్పుడే సింహాచలం దేవస్థానానికి రైత్వారీ పట్టాలు కట్టబెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. అప్పటి నుంచే ఈ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోరుతూ సీపీఎం గత పది రోజులుగా చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘గడిచిన మూడు దశాబ్దాలుగా పంచగ్రామాల నివాసితులు, రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. పట్టాలు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. 1996–97లో దేవస్థానానికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, ప్రస్తుత నివాసితుల పేరిట పట్టాలు ఇవ్వాలి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలి’ అని హెచ్చరించారు. విశాఖ వాసులను నిర్వాసితులుగా మార్చేస్తూ, నగరం పేరును ‘గూగుల్ పట్నం’గా మార్చేస్తున్నారని విమర్శించారు. 12 వేల మంది ప్రజలు దశాబ్దాలుగా సమస్యతో సతమతమవుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, కేవలం ఒక కలం పోటుతో 260 ఎకరాల దేవస్థానం భూములను ఎకరం కేవలం 99 పైసలకే గూగుల్ సంస్థకు కట్టబెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. ఇది లీజు అగ్రిమెంట్ కాదు, నేరుగా సేల్ అగ్రిమెంట్ అని ఆరోపించారు. పారిశ్రామికవేత్తల తీర్పు కోరుతున్న చంద్రబాబు.. తనను ప్రజలు గెలిపించారో లేక పారిశ్రామికవేత్తలు గెలిపించారో ఆలోచించుకోవాలన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పడం ఒక పెద్ద మోసం అని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. గూగుల్ ఏర్పాటు కోసం రూ.22వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కాకుంటే చలో అమరావతి నిర్వహిస్తామని ప్రకటించారు. సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సభలో సీపీఎం నాయకులు బి.గంగారావు, పి. వెంకటరెడ్డి, అజశర్మ, బి.రమణి, పి.వి.ఎస్.ఎన్. శాస్త్రి, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
సభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
బహిరంగ సభలో పాల్గొన్న పంచ గ్రామాల ప్రజలు


