మహారాణిపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరిపాలన, పర్యవేక్షణ, సిబ్బంది వినియోగం, రోగులకు మార్గదర్శక వ్యవస్థను బలోపేతం చేయాలని ఎంపీ శ్రీభరత్ సూచించారు. మంగళవారం ఆంధ్ర వైద్య కళాశాలలో కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్‌తో కలిసి నిర్వహించారు. ఆసుపత్రి సేవలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎంపీ, సిబ్బంది కొరత లేదా అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ల్యాబ్ పరీక్షల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని విభాగాల్లో పడకల కొరతతో ఇద్దరు రోగులు ఒకే బెడ్‌ను వినియోగిస్తుండగా, మరికొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అత్యవసర విభాగాల్లో సౌకర్యాల విస్తరణ, ఎయిర్ కండీషనింగ్ సమస్యల పరిష్కారం, మరుగుదొడ్ల నిర్వహణ, స్ట్రెచర్లు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. మృతదేహాల తరలింపు, పోస్టుమార్టం సేవల్లో డబ్బులు డిమాండ్ చేయడం సహించబోమని హెచ్చరించారు.
‘మే ఐ హెల్ప్ యూ’ డెస్కులు
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ రోగులకు సరైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆసుపత్రి పరిధిలో ఎనిమిది ‘మే ఐ హెల్ప్ యూ’ డెస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓపీ విభాగాలు, ల్యాబ్‌లు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో నర్సింగ్ విద్యార్థులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందితో సహాయక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఫాలోఅప్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారం కోసం కంప్లైంట్ బాక్సులు, టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామని, కొంతమంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపై ఇప్పటికే సస్పెన్షన్, టర్మినేషన్ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.


