సమష్టి పోరాట ఫలితమే విశాఖ రైల్వే జోన్‌ | - | Sakshi
Sakshi News home page

సమష్టి పోరాట ఫలితమే విశాఖ రైల్వే జోన్‌

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

అల్లిపురం: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడం రాజకీయ పార్టీలు, పౌర, ప్రజాసంఘాల సమష్టి విజయం అని రైల్వే జోన్‌ సాధన సమితి కన్వీనర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదుల కృషితో సాగిన పోరాట ఫలితమే నేటి ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’అని ఆయన స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకో లేదా వ్యక్తికో దక్కిన విజయం కాదని, రాష్ట్రంలోని అన్ని శక్తులు ఏకతాటిపైకి వచ్చి చేసిన పోరాటమని గుర్తు చేశారు. జూన్‌ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఈ ప్రకటన వెనుక అనేక మంది త్యాగాలు, ఎదుర్కొన్న నిర్బంధాలు, కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోరాటంలో సీపీఐ, సీపీఎం సహా ఇతర వామపక్షాలు, కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ సీపీ, లోక్‌సత్తా, బీజేపీ నాయకుల కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ జోన్‌ ద్వారా వచ్చే ప్రయోజనాలు ఉత్తరాంధ్ర ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అందరం కలిసి కృషి చేద్దామని సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఎ.విమల, ఎస్‌.కె.రహిమాన్‌, కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్‌, ఎం.పైడిరాజు, సి.హెచ్‌.క్షేత్రపాల్‌ రెడ్డి, ఎం.మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

రైల్వే జోన్‌ సాధన సమితి కన్వీనర్‌ జేవీ సత్యనారాయణమూర్తి

Advertisement
 
Advertisement
Advertisement