నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సముద్ర తీరం కావడంతో గాలిలో తేమ శాతం పెరిగి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలవుతోంది. మధ్యాహ్నం అయ్యే సరికి ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. రోడ్లపై వెళ్తుంటే వేడి గాలులు ముఖానికి తగిలి పాదచారులు, ద్విచక్ర వాహనదారులు అల్లాడిపోతున్నారు. ఎండ వేడికి భయపడి ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావడానికి సాహసించడం లేదు.అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే గొడుగులు, టోపీలు ధరించి బయటకు వస్తున్నారు. రోడ్లపై విపరీతమైన వేడిమి వల్ల ఎండమావులు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై నీళ్లు ఉన్నట్లు కనిపిస్తూ వాహనదారులను భ్రమింపజేస్తున్నాయి. ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


