మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కంది నీలిమ
అల్లిపురం: మహిళలు, బాలికలపై జరిగే నేరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మహిళా పోలీస్ స్టేషన్ కొత్త సీఐ కంది నీలిమ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ సీహెచ్ అంబేడ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏసీపీ అంబేడ్కర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేయాలని సీఐకి సూచించారు. శక్తి యాప్ వినియోగం, మహిళా చట్టాలపై విద్యార్థినులకు నిరంతరం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఐ నీలిమ మాట్లాడుతూ.. గతంలో తాను ఎస్‌ఐగా ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని, బాధితులకు, ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉంటానని తెలిపారు.


