కన్నీట్‌ సుడులు | - | Sakshi
Sakshi News home page

కన్నీట్‌ సుడులు

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

నీట్‌ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతం
ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని అభ్యర్థుల ఆవేదన

రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్ని పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్‌ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది. ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది.

మద్దిలపాలెం: వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్‌తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ‘అమ్మా, నాన్నా.. నేను డాక్టర్‌ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్‌ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది.

ప్రతిభావంతులు బలి

రాజస్థాన్‌లో వెలుగు చూసిన ‘పేపర్‌ లీక్‌’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను ర ద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు.

ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ

చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్‌ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది.

ఎన్టీఏ భరోసా సరిపోతుందా?

రీ–ఎగ్జామ్‌ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని ఎన్టీఏ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసికస్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే.

వ్యవస్థ మారేది ఎప్పుడు?

పేపర్‌ లీక్‌.. రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు.

కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి

నీట్‌ పరీక్షల్లో వరుసగా వెలుగుచూస్తున్న పేపర్‌ లీకేజీ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పీడీఎస్‌వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్‌ డిమాండ్‌ చేశారు. మే 3న నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షలో ‘గెస్‌ పేపర్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారమైన ప్రశ్నలు అసలు పరీక్షలో రావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నా రు. గత ఏడాది కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నీట్‌ స్కామ్‌ల వల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌వో డిమాండ్‌ చేసింది.

కేంద్ర అసమర్థత వల్లే : ఎస్‌ఎఫ్‌ఐ

మద్దిలపాలెం: నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎస్‌ఎఫ్‌ఐ విశాఖ జిల్లా కమిటీ విమర్శించింది. జిల్లా అధ్యక్షుడు జి.అజయ్‌, కార్యదర్శి డి.వెంకటరమణ మాట్లాడుతూ, జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పూర్తిగా విఫలమైందన్నారు. నీట్‌లో భారీ స్థాయిలో ప్రశ్నలు లీక్‌ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇది పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను బయటపెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ కేంద్రీకరణ విధానాల వల్లే ఎగ్జామ్‌ మాఫియా పెరిగి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement