మద్దిలపాలెంలో సత్యారెడ్డి అరాచకం | - | Sakshi
Sakshi News home page

మద్దిలపాలెంలో సత్యారెడ్డి అరాచకం

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

స్థల యజమానిపై అనుచరులతో కలిసి దాడి

తీవ్రగాయాలతో ఆసుపత్రిలో బాధితుడు

కోర్టు వివాదంలో ఉన్న ప్లాట్ల విక్రయం

దాడి ఘటనపై కేసు నమోదు

ఎంవీపీకాలనీ: మద్దిలపాలెంలో 23వ వార్డు మాజీ కార్పొరేటర్‌ భర్త గుడ్ల సత్యారెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఒకపక్క లిక్కర్‌ దందాతో, మరోపక్క నిర్మాణ రంగం(బిల్డర్‌గా)లో బెదిరింపులకు పాల్పడు తూ ఆయన భయాందోళనలు సృష్టిస్తున్నారు. తాజాగా సత్యారెడ్డి, అతని అనుచరులపై నీలాపు మోహనరావు అనే వ్యక్తి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని అరాచక పర్వం మరోసారి వెలుగులోకి వచ్చింది.

మద్దిలపాలెంలోని దేవి హోమ్స్‌ ఎదురుగా ఉన్న తన 384 గజాల స్థలాన్ని మోహనరావు గతంలో డెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన షేర్‌ ఇవ్వాలని ఆయన కొన్నేళ్లుగా సత్యారెడ్డిని కోరుతున్నారు. ఈ వివాదంపై సత్యారెడ్డి స్పందించకపోవడంతో, మోహనరావు 2024లో కోర్టును ఆశ్రయించారు. విచారణలో సమయంలో కోర్టు సమక్షంలో సత్యారెడ్డి రూ.16 లక్షలు బాధితుడికి చెల్లించారు. అయితే మరికొంత నగదుతో పాటు ఒక ఫ్లాట్‌, కార్‌ పార్కింగ్‌ స్థలం, అద్దె నగదు మోహనరావుకు చెల్లించాల్సి ఉంది. వీటిని కూడా కోర్టు సమక్షంలోనే చెల్లిస్తానని హామీ పత్రం ఇచ్చిన సత్యారెడ్డి, కొంతకాలంగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మరోవైపు, వివాదంలో ఉన్న ఫ్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా ఫ్లాట్‌లు రిజిస్ట్రేషన్‌ కాకపోయినా.. కొందరు తెలియక అడ్వాన్స్‌ చెల్లిస్తుండటంతో దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

బాధితుడిపై పిడిగుద్దులు : కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్లాట్లు విక్రయిస్తుండటంతో, బాధితుడు మోహనరావు ఈ నెల 8న భవన సముదాయం వద్దకు వెళ్లి కొనుగోలుదారులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న సత్యారెడ్డి తన అనుచరులు నాగేశ్వరరెడ్డి, రవి, మహేష్‌, భరత్‌లతో కలిసి అక్కడికి చేరుకుని మోహనరావుపై దాడి చేశారు. పిడిగుద్దులతో విరుచుకుపడటంతో మోహనరావు తీవ్రంగా గాయపడ్డారు. బీపీ, షుగర్‌ వంటి అనారోగ్య సమస్యలతో ఉన్న ఆయన ఈ దాడితో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. స్థానికుల సాయంతో వారి నుంచి తప్పించుకుని కేజీహెచ్‌లో చేరిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం ఎంవీపీకాలనీలోని మెడికవర్‌లో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు ఎంఎల్‌సీ నమోదు చేయగా, ఎస్‌ఐ డి.డి.నాయుడు బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

ఎట్టకేలకు కేసు నమోదు : ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల వరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేయలేదు. సత్యారెడ్డి మాజీ కార్పొరేటర్‌ భర్త కావడంతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటం వల్లే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, తీవ్ర వివాదస్పదమైన ఈ ఘటనపై ఎట్టకేలకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసు స్టేషన్‌ వర్గాలు వెల్లడించాయి. తనపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు మోహనరావు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement